మిథాలీ చాలా బాధపడింది: వ్యక్తిగత కోచ్‌ | Mithali Raj Terribly Disappointed After World T20 Semis Axing, says Her Personal Coach  | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 24 2018 8:46 PM | Last Updated on Sat, Nov 24 2018 8:46 PM

 Mithali Raj Terribly Disappointed After World T20 Semis Axing, says Her Personal Coach  - Sakshi

నార్త్‌ సాండ్‌ (అంటిగ్వా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళలు చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ కీలక మ్యాచ్‌కు సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను బెంచ్‌కు పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు అభిమానులు.. ఇటు క్రికెట్‌ విశ్లేషకులు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, కోచ్‌ రమేశ్‌ పవార్‌లపై మండిపడుతున్నారు. అనుభవజ్ఞరాలైన, మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను బెంచ్‌కు పరిమితం చేసి తగినమూల్యం చెల్లించుకున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుది జట్టులో చోటు దక్కకపోవడంపై మిథాలీ కూడా చాలా బాధపడిందని ఆమె వ్యక్తిగత కోచ్‌ పీఎస్‌ఆర్‌ మూర్తి తెలిపారు. ఓ స్పోర్ట్స్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘మోకాలి గాయంతో గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన మిథాలీ.. సెమీఫైనల్‌కు శారీరకంగా, మానసికంగా సిద్దమైంది. కానీ ఆమెకు జట్టులో చోటు లేదన్న విషయం కూడా మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు వార్మప్‌ సెషన్‌ అనంతరమే తెలిసింది. దీంతో ఆమె చాలా బాధపడింది. మ్యాచ్‌ ముందు రోజు రాత్రి ఆమెను మానసికంగా సిద్దం చేశా. మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం ఉన్నట్లు హింట్‌ రావడంతో.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు ఆస్వాదించమని చెప్పాను. కానీ కోచ్‌, కెప్టెన్‌లు ఆమెను తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. మ్యాచ్‌ అనంతరం జట్టు కూర్పుపై పశ్చాతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ మాట్లాడటం బాధేసింది. ఆట కోసం ఎంతో చేసిన ఓ ప్లేయర్‌ పట్ల ఇలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదు. మిథాలీ ఈ టోర్నీలోని రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. అలాంటి ఆమె అనుభవం సెమీస్‌ మ్యాచ్‌లో తప్పక ఉపయోగపడేది.’ అని అభిప్రాయపడ్డారు.

ఇక మిథాలీ మేనేజర్‌ సైతం హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథిగా అనర్హురాలని, మాటలు మార్చడం, అబద్దాలు చెప్పడం ఆమెకు అలవాటని మండిపడుతూ ట్వీట్‌ చేసింది. ఇక ఈ వ్యవహారంతో బీసీసీఐ మహిళల క్రికెట్‌లో రాజకీయాలు వెలుగు చూశాయి. మిథాలీ, హర్మన్‌ల మధ్య గొడవలున్నాయని స్పష్టం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement