మిథాలీని  పక్కనపెట్టి... | Manipulative, lying, cheat: Mithali Raj  manager lashes out at Harmanpreet Kaur | Sakshi
Sakshi News home page

మిథాలీని  పక్కనపెట్టి...

Published Sat, Nov 24 2018 12:47 AM | Last Updated on Sat, Nov 24 2018 12:47 AM

Manipulative, lying, cheat: Mithali Raj  manager lashes out at Harmanpreet Kaur - Sakshi

ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టును మార్చదల్చుకోలేదు. కాబట్టే మిథాలీని తీసుకోలేదు. ఏం చేసినా జట్టు కోసమే’... అత్యంత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ను తప్పించడంపై ఇదీ భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వివరణ! ఆమె మాటల్లో ఒకింత అసహనం, కూసింత అహంకారం కూడా కనిపించాయి. ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు 2009నుంచి ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి 24 మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలో మిథాలీ రాజ్‌ బరిలోకి దిగింది. అత్యంత కీలకమైన సెమీ ఫైనల్లో ఆమెకు అవకాశం ఇవ్వకుండా కెప్టెన్‌ చెబుతున్న కారణం ఆశ్చర్యపరిచేదే. రెండు ఇన్నింగ్స్‌లు ఆడితే రెండు అర్ధసెంచరీలతో రెండు సార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన మిథాలీ విలువను గుర్తించకపోవడం విచారకరం. నిజంగా చెప్పాలంటే మిథాలీ అవసరం ఈ మ్యాచ్‌లో అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. నెమ్మదైన పిచ్, భారీ షాట్లకు అవకాశం లేదు, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ తెలివిగా సింగిల్స్‌ ద్వారానే ఎక్కువగా పరుగులు రాబట్టాల్సిన స్థితి. ఈ పాత్రను మాజీ కెప్టెన్‌ కంటే ఎవరూ సమర్థంగా పోషించలేరు. తమ జట్టును గెలిపించడంలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోన్స్, స్కివర్‌ ఆడిన తీరు చూస్తే మిథాలీ ఉంటే బాగుండేదని కచ్చితంగా అనిపిస్తుంది. తనతో పాటు స్మృతి, జెమీమా భారీ షాట్లతో చెలరేగితే చాలు విజయం సాధ్యమని నమ్మిన హర్మన్‌... కాస్త నెమ్మదిగా ఆడే మిథాలీ శైలి సరిపోదని భావించినట్లుంది. భారత్‌ తమ నాలుగు లీగ్‌ మ్యాచ్‌లను ప్రొవిడెన్స్‌లో ఆడి భారీ స్కోర్లు చేసింది. దానికి పూర్తి భిన్నంగా ఉన్న పిచ్‌పై చేతులెత్తేసింది. ఇక్కడ ఎలా ఆడాలో అర్థం చేసుకోకుండా గుడ్డిగా షాట్లు ఊపి ఔటైన హర్మన్, వేద, అనూజ పరాజయాన్ని ఆహ్వానించారు.

ఈ టోర్నీలో భారత్‌ తరఫున టాప్‌–4 మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఐదో స్థానంనుంచి చివరి వరకు ఏ ఒక్కరినీ నమ్మలేని స్థితి. సెమీస్‌తో కలిపి ఐదు ఇన్నింగ్స్‌లలో 24 పరుగులు మాత్రమే చేసిన వేద కృష్ణమూర్తి ఘోరంగా విఫలమైంది. హర్మన్‌ ఓపెనర్‌గా నమ్మిన తాన్యా 3 ఇన్నింగ్స్‌లలో కలిపి చేసింది 22 పరుగులు. ఇలాంటి స్థితిలో ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌ను బౌలర్‌ కోసం త్యాగం చేయడం ఆత్మహత్యాసదృశం. అద్భుతమైన స్ట్రయిక్‌ రేట్‌ లేకపోయినా ఇన్నింగ్స్‌ కుప్పకూలకుండా నిలువరించగల సత్తా హైదరాబాదీకి ఉంది. ఒక దశలో 89/2తో ఉన్న జట్టు 112 పరుగులకే ఆలౌట్‌ కావడం చూస్తే చివరి వరుస ప్లేయర్లతో కలిసి మిథాలీ అదనపు పరుగులు జోడిస్తే మ్యాచ్‌ ఫలితం భిన్నంగా ఉండేదేమో.   ప్రాధాన్యత లేని గత మ్యాచ్‌లో మోకాలి గాయంతో ముందు జాగ్రత్తగా మిథాలీ విశ్రాంతి తీసుకుంది. ఆమె స్థానంలో వచ్చిన స్పిన్నర్‌ అనూజను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించారు. దీప్తి, రాధ, పూనమ్, హేమలత రూపంలో నలుగురు రెగ్యులర్‌ స్పిన్నర్లు ఉండగా ఐదో స్పిన్నర్‌ను తీసుకోవడంలో అర్థం లేదు. ఆమె కోసం మిథాలీని పక్కన పెట్టడంతో ఒక బ్యాట్స్‌మెన్‌ లోటు స్పష్టంగా కనిపించింది. 3.1 ఓవర్లలో 27 పరుగులిచ్చి వికెట్‌ తీయలేకపోయిన అనూజ బ్యాటింగ్‌లో తొలి బంతికే వెనుదిరిగింది. సెమీస్‌లో జెమీమాను కూడా ఆరో స్పిన్నర్‌గా వాడారు. టీమ్‌లో ఉన్న ఏకైక పేసర్‌ అరుంధతి రెడ్డితో ఒక్క ఓవర్‌ కూడా వేయించకపోవడం కెప్టెన్సీ లోపాలను చూపించింది! పిచ్‌ను బట్టి గెలుపు కోసం పూర్తిగా స్పిన్‌నే జట్టు నమ్ముకుంటే ఆ పేసర్‌నైనా పక్కన పెట్టాల్సింది. మొత్తంగా పేలవమైన ఆటతో పాటు తప్పుడు వ్యూహాలతో హర్మన్‌ బృందం మంచి అవకాశం కోల్పోయింది. వన్డే వరల్డ్‌ కప్‌లో ఫైనల్లో ఓడినా సగర్వంగా తిరిగొచ్చిన టీమిండియాకు స్వయంకృతంతో దక్కిన ఈ పరాజయం మాత్రం చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు.      

‘మిథాలీని తప్పించాలనే మా నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కొన్నిసార్లు వ్యూహాలు ఫలిస్తాయి. మరికొన్ని సార్లు తారుమారవుతాయి. ఏం చేసినా జట్టు కోసమే. టోర్నీలో జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. కనీసం 140 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండేది. మాది ఇంకా  యువ జట్టే. మానసికంగా బలంగా ఉంటూ ఒత్తిడిలో ఎలా ఆడాలో  ఇక ముందు నేర్చుకుంటాం’ 
– హర్మన్‌ప్రీత్‌ కౌర్, భారత కెప్టెన్‌    
– సాక్షి, క్రీడా విభాగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement