మెల్‌బోర్న్: టోర్నీ మొదలైన రోజే నాలుగుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత మహిళలు... అదే జోరుతో బంగ్లాదేశ్‌నూ చిత్తు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసిన హర్మన్‌ప్రీత్ సేన అందరికంటే ముందుగా సెమీస్ చేరాలని తహతహలాడుతోంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో గ్రూప్ ‘ఎ’లో ఇప్పటిదాకా ఎదురులేని భారత జట్టు గురువారం జరిగే పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో మన అమ్మాయిలు ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ మెరుపుదాడి... టాపార్డర్ బ్యాట్స్‌మన్ జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారత ఇన్నింగ్స్‌కు బలంకాగా... బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నుంచే ఇంకా అవసరమైన మెరుపులు రాలేదు.
బహుశా కివీస్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో ఆ లోటు తీర్చుకునే అవకాశముందేమో చూడాలి. జ్వరంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన జట్టులోకి రావడం భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసింది. మిడిలార్డర్‌లో దీప్తి శర్మతో పాటు వేద కృష్ణమూర్తి మెరుపులు మెరిపించగలరు. స్పిన్నర్ పూనమ్‌తో పాటు పేసర్ శిఖా పాండే వెటరన్ స్టార్ జులన్ గోస్వామి లేని లోటును సమర్థంగా భర్తీ చేస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత విజయానికి బౌలింగ్ దళం ఎంతగానో దోహదపడింది. ఇక కివీస్ విషయానికొస్తే... భారత్‌పై ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది. గత మూడు ముఖాముఖి పోటీల్లో న్యూజిలాండే గెలిచింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, సుజీ బేట్స్... బౌలింగ్‌లో లియా తహుహు, అమెలియా కెర్ జట్టుకు ప్రధాన బలం కాగా... ఫామ్‌లో ఉన్న భారత్‌ను కివీస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment