harmanpreet kour
-
జులన్‌కు ఘనమైన వీడ్కోలే లక్ష్యంగా...
హోవ్: పొట్టి ఫార్మాట్లో నిరాశపరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉంది. టి20ల్లో పేలవమైన ఆటతీరుతో హర్మన్‌ప్రీత్ జట్టు 1–2తో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది. కానీ ఇప్పుడు దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామికి ఇది ఆఖరి సిరీస్ కావడంతో సిరీస్ గెలిచి తమ సహచర క్రీడాకారిణికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అమ్మాయిలంతా బాధ్యత కనబరిస్తే గత వైఫల్యాల్ని అధిగమించవచ్చు. ముందుగా ఆదివారం జరిగే తొలి వన్డేలో శుభారంభం చేస్తే సిరీస్‌పై పట్టుసాధించవచ్చని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. టాపార్డర్‌లో స్మృతి, షఫాలీ సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డితే మిగతా వారికి పని సులువవుతుంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ హీథెర్‌నైట్ గాయంతో దూరమవడం ఇబ్బందికరం. అయితే ఇంగ్లండ్ మంచి ఆల్‌రౌండ్ జట్టు. పైగా టి20 సిరీస్ గెలిచిన ఊపు మీదుంది. ఇదే జోరుతో సొంతగడ్డపై వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లే, డానీ వ్యాట్, మూడోస్థానంలో అలైస్ కాప్సీ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసివస్తోంది. బౌలింగ్‌లోనూ సోఫీ ఎకిల్‌స్టోన్, ఫ్రెయా డెవిస్ భారత బ్యాటర్లపై ప్రభావం చూపగలరు. -
కంగ్రాట్స్ హర్మన్.. ఆ నలుగురి తరువాత నువ్వే
లక్నో: టీమిండియా బ్యాట్స్‌వుమన్ హర్మన్ ప్రీత్ కౌర్ లక్నో వేదికగా దక్షిణాఫ్రికతో జరిగిన తొలి వన్డే ద్వారా అరుదైన ఘనతను సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. భారత్ తరఫున 100కు పైగా వన్డేలు ఆడిన క్రీడాకారిణుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిథాలి రాజ్ (210), జులాన్ గోస్వామి (183), అంజుమ్ చోప్రా (127), అమితా శర్మ (116)లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో భారత వన్డే వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేరింది. ఆమె సాధించిన ఈ ఘనతకు గాను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ హర్మన్.. వెల్కమ్ టు ద క్లబ్ అంటూ సహచర క్రికెటర్లు ట్వీట్లతో అభినందించారు. హర్మన్ 100 మ్యాచ్‌ల్లో 3 శతకాలు 11 అర్ధ శతకాల సాయంతో 2,412 పరుగులు చేసింది. అజేయమైన 171 పరుగులు ఆమె అత్యధిక స్కోరుగా ఉంది. టీ20 కెప్టెన్ కూడా అయిన ఆమె..114 మ్యాచ్‌ల్లో ఒక శతకం, ఆరు అర్థ శతకాల సాయంతో 2186 పరుగులు సాధించింది. దూకుడుగా ఆడే క్రికెటర్‌గా పేరున్న హర్మన్‌కు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం పెద్దగా లభించింది. ఆమె కేవలం 2 మ్యాచ్‌ల్లో 26 పరుగులు మాత్రమే సాధించింది. పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రాణించే ఆమె..టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 23, టీ20ల్లో 29 వికెట్లు సాధించింది. -
వెలాసిటీ బోణీ
షార్జా: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఐదు వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టుపై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ చమరి ఆటపట్టు (39 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించింది. ఏక్తాబిష్త్ 3 వికెట్లు తీసింది. తర్వాత వెలాసిటీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునె లూస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సుష్మ వర్మ (33 బంతుల్లో 34; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రాణించిన చమరి... ఓపెనర్ ప్రియా (11), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... మరో ఓపెనర్ చమరి ఆటపట్టు కుదరుగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. మనాలీ, కాస్పెరెక్ ఓవర్లలో సిక్సర్లు బాదిన చమరి దూకుడుకు జహనార చెక్ పెట్టింది. కాసేపటికే హర్మన్ (27 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను జహనార పెవిలియన్ చేర్చగా... తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో సిరివర్దెనె (18) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 20వ ఓవర్ వేసిన ఏక్తా బిష్త్ ఆఖరి రెండు బంతుల్లో రాధా యాదవ్ (2), షకీరా (5)లను అవుట్ చేసింది. జహనార, కాస్పెరెక్ చెరో 2 వికెట్లు తీశారు. ఆఖర్లో ఉత్కంఠ... బంతికో పరుగు చొప్పున చేయాల్సిన లక్ష్యం. కానీ ఖాతా తెరువకుండానే ఓపెనర్ వ్యాట్ (0)ను, లక్ష్యఛేదనలో సగం పరుగులు చేయగానే షఫాలీ (11 బంతుల్లో 17), కెప్టెన్ మిథాలీ (7), వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్లలో వెలాసిటీ స్కోరు 65/4. ఇంకా 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన సమీకరణం. చివరి 5 ఓవర్లలో అయితే ఓవర్‌కు 10 చొప్పున 50 పరుగులు చేయాలి. లక్ష్యానికి దాదాపు దూరమైన తరుణంలో సుష్మ, సునె లూస్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. పూనమ్ 16వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్ బాదడంతో 14 పరుగులు, సిరివర్దెనె 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో లక్ష్యం సులువైంది. సుష్మ అవుటైనా... ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లూస్, శిఖాపాండే చెరో బౌండరీతో గెలిపించారు. నేడు జరిగే మ్యాచ్‌లో వెలాసిటీతో ట్రయల్ బ్లేజర్స్ తలపడుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఐదారేళ్లు వెనుకబడి ఉన్నాం
2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్, 2018 టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్, 2020 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్... వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళల క్రికెట్ జట్టు నాకౌట్ దశకు చేరినా టైటిల్ మాత్రం దక్కలేదు. అప్పటి వరకు బాగా ఆడుతూ వచ్చిన మన అమ్మాయిలు కీలక దశలో చేతులెత్తేశారు. బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నట్లు కనిపించినా... ఓవరాల్‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్ల స్థాయికి మనం ఇంకా చేరుకోలేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ అంతరం తగ్గాల్సిన ఆవశ్యకత ఉందని భారత టి20 టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెబుతోంది. ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్‌నకు మరో ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో ఈ టోర్నీ జరగనుంది. గత మూడు ఐసీసీ టోర్నీల ఫలితాలను చూసుకుంటే వచ్చే మెగా టోర్నీలోగా పలు లోపాలను మనం సరిదిద్దుకోవాల్సి ఉందని టీమ్ అగ్రశ్రేణి బ్యాటర్, టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (వన్డే టీమ్‌కు మిథాలీ రాజే కెప్టెన్) అభిప్రాయపడింది. ఇందులో ఫీల్డింగ్, ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడంతో పాటు పేసర్లను తీర్చిదిద్దడం కూడా కీలకమని ఆమె చెబుతోంది. వివిధ అంశాలపై హర్మన్ అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... భారత జట్టు ఫిట్‌నెస్‌పై... దురదృష్టవశాత్తూ మనం ఇలాంటి అంశాలు చాలా ఆలస్యంగా మొదలు పెడతాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్ల విషయంలో ఫిట్నెస్ వారి సంస్కృతిలో ఒక భాగంలా ఉంది. ఇతర జట్లతో పోలిస్తే ప్రతిభపరంగా బ్యాటింగ్, బౌలింగ్‌లలో కూడా మన జట్టు ఎంతో మెరుగ్గా ఉంది. కానీ ఫిట్నెస్ మాత్రమే మమ్మల్ని వెనక్కి లాగుతోంది. ఇప్పుడు మన అమ్మాయిల్లో అందరిలోనూ దీనిపై శ్రద్ధ పెరిగింది కాబట్టి శ్రమిస్తున్నారు. వారికి కూడా తమ బాధ్యత అర్థమైంది. ఒక్క రోజులో ఇదంతా మారిపోదు. సుదీర్ఘ సమయం పాటు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మన దేశవాళీ క్రికెట్‌పై... ఇది మరో పెద్ద లోపం. సరిగ్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకంటే మనం ఈ విషయంలో కనీసం ఐదారేళ్లు వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు కొంత మారుతున్నా.... కొన్నాళ్ల క్రితం వరకు కూడా దేశవాళీ క్రికెట్లో ఇస్తున్న ప్రదర్శనకు, అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి వారు ఆడుతున్న తీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. ఇటీవల బీసీసీఐ 30 మంది మహిళా క్రికెటర్లకు ప్రత్యేక షెడ్యూల్ తయారు చేసి ఇస్తుండటంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనను బట్టి జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే వారు తడబాటుకు గురి కావడం కొంత తగ్గింది. తమ నుంచి టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆశిస్తోందో వారికి అర్థమవుతోంది. నిజాయితీగా చెప్పాలంటే దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఎలా ఉండాలో అలా మాత్రం ఇప్పటికీ లేదు. అందుకే ఐదారేళ్లు వెనుకబడిన పోలిక తెస్తున్నాను. దేశవాళీ స్థాయి పెరిగితేనే అంతర్జాతీయ స్థాయిలో కూడా బాగా ఆడగలరని నా అభిప్రాయం. పేస్ బౌలింగ్ బలహీనతలపై... ఒకటి, రెండేళ్ల క్రితం పేస్ బౌలర్లను తీర్చిదిద్దడంపై మనం దృష్టి పెట్టి ఉంటే ఇంతగా స్పిన్నర్లను నమ్ముకునే అవసరం రాకపోయేది (ప్రపంచకప్‌లో ఒకే ఒక పేసర్ శిఖా పాండే అన్ని మ్యాచ్‌లు ఆడగా, అరుంధతి రెడ్డి రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగింది). జట్టు అవసరాలను బట్టి చూస్తే మనకు కనీసం ముగ్గురు పేస్ బౌలర్ల అవసరం ఉంది. అయితే వారిలో ఏమాత్రం సత్తా ఉందనేది కూడా చూడాలి. ఈ విభాగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బౌలర్లను దాటి బయట సరైన ప్రతిభను అన్వేషించాలి. వచ్చే రెండేళ్లలో నాణ్యమైన పేసర్లు మనకు లభిస్తారని నమ్ముతున్నా. స్వీయ బ్యాటింగ్ వైఫల్యాలు, కెప్టెన్సీపై... టి20 జట్టు కెప్టెన్సీ నాకు భారం కాదు. నా బ్యాటింగ్‌పై దాని ప్రభావం ఉందంటే అంగీకరించను (ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 30 పరుగులే చేసిన హర్మన్ టి20ల్లో ఆఖరిసారిగా 16 నెలల క్రితం అర్ధ సెంచరీ నమోదు చేసింది. ఫిబ్రవరి 2018 తర్వాత ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ చేయలేదు). బయటినుంచి చూస్తే నేను విఫలమైనట్లు కనిపించవచ్చు కానీ నాకు అలాంటి భావన ఏమీ లేదు. నా బ్యాటింగ్‌పై నాకు విశ్వాసం ఉంది. గణాంకాలు వాటిని సరిగా విశ్లేషించలేవు. వీటి వల్ల నా నైతిక స్థయిర్యం దెబ్బతినదు. కెప్టెన్సీని నేను బాగా ఆస్వాదిస్తున్నాను. అన్ని విషయాల్లో భాగమవుతూ చురుగ్గా నా బాధ్యతలు నెరవేరుస్తున్నా. గతంలో నా బ్యాటింగ్ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. సారథ్యం కారణంగా వ్యక్తిగతంగానూ నాలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఇప్పుడు నా గురించి మాత్రమే కాకుండా ఇతర అన్ని అంశాల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత నాపై ఉంది. స్పిన్‌పై అతిగా ఆధారపడటంపై... ఇటీవల టి20 ప్రపంచకప్‌లో స్పిన్‌ను అనుకూలంగా లేని పిచ్‌లపై కూడా వారినే నమ్ముకున్నాం. క్రికెట్ వ్యూహాలపరంగా చెప్పాల్సి వస్తే అది ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. అయితే అలాంటి పెద్ద టోర్నీలో ఒక జట్టుకు తమ బలాలు, బలహీనతల గురించి తెలిసి ఉండటం, బలాన్ని సమర్థంగా వాడుకోవడం కూడా కీలకం. ప్రస్తుత స్థితిలో స్పిన్నర్లు మా జట్టు బలం. అందుకే తప్పడం లేదు. -
హ్యాట్రిక్‌పై భారత్ గురి
మెల్బోర్న్: టోర్నీ మొదలైన రోజే నాలుగుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత మహిళలు... అదే జోరుతో బంగ్లాదేశ్‌నూ చిత్తు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసిన హర్మన్‌ప్రీత్ సేన అందరికంటే ముందుగా సెమీస్ చేరాలని తహతహలాడుతోంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో గ్రూప్ ‘ఎ’లో ఇప్పటిదాకా ఎదురులేని భారత జట్టు గురువారం జరిగే పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో మన అమ్మాయిలు ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ మెరుపుదాడి... టాపార్డర్ బ్యాట్స్‌మన్ జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారత ఇన్నింగ్స్‌కు బలంకాగా... బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నుంచే ఇంకా అవసరమైన మెరుపులు రాలేదు. బహుశా కివీస్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో ఆ లోటు తీర్చుకునే అవకాశముందేమో చూడాలి. జ్వరంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన జట్టులోకి రావడం భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసింది. మిడిలార్డర్లో దీప్తి శర్మతో పాటు వేద కృష్ణమూర్తి మెరుపులు మెరిపించగలరు. స్పిన్నర్ పూనమ్‌తో పాటు పేసర్ శిఖా పాండే వెటరన్ స్టార్ జులన్ గోస్వామి లేని లోటును సమర్థంగా భర్తీ చేస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత విజయానికి బౌలింగ్ దళం ఎంతగానో దోహదపడింది. ఇక కివీస్ విషయానికొస్తే... భారత్‌పై ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది. గత మూడు ముఖాముఖి పోటీల్లో న్యూజిలాండే గెలిచింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, సుజీ బేట్స్... బౌలింగ్‌లో లియా తహుహు, అమెలియా కెర్ జట్టుకు ప్రధాన బలం కాగా... ఫామ్‌లో ఉన్న భారత్‌ను కివీస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. -
2 పరుగులతో గెలిచిన భారత్
బ్రిస్బేన్: విమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. షఫాలి వర్మ 12, దీప్తి శర్మ 21, శిఖా పాండే 24, పూజ వస్త్రకర్ 13, హర్మన్‌ప్రీత్ కౌర్ 11 పరుగులు సాధించారు. జెమీమా రోడ్రిగ్స్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. శిఖా పాండే, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: ఆల్ ద బెస్ట్ హర్మన్) అదరగొట్టిన ఆటపట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు హాసిని పెరీరా(29) అండగా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. శ్రీలంక 12.3 ఓవల్‌లో వికెట్ కోల్పోకుండా 123 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు రావడం విశేషం. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. -
ఆల్ ద బెస్ట్ హర్మన్
క్రికెట్ మగవాళ్ల ఆట అని అనేవాళ్లు ఇప్పుడు జంకుతున్నారు. స్టేడియంలో స్త్రీలు కొడుతున్న సిక్సర్లు అలా ఉన్నాయి. మహిళా క్రికెట్ దినదినప్రవర్థమానమవుతోంది. సంప్రదాయ ఆటను దాటి టి20 స్థాయికి ఎదిగింది. పది దేశాల మహిళలు ప్రపంచ కప్ కోసం తలపడనున్నారు. వారు ఒకరితో ఒకరు పోటీ పడినా అందరూ కలిసి రుజువు చేయాలనుకుంటున్నది మాత్రం ‘క్రికెట్ మా ఆట కూడా’ అని చెప్పడమే. మహిళలను ‘ఆకాశంలో సగం’... అంటుంటారు. కానీ ఆదరణ విషయంలో, ఆర్థిక అంశాల్లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఎంతో వివక్ష ఉంది. అయితే పురుష క్రికెటర్లకు దీటుగా తామూ మెరిపించగలమని, ధనాధన్ ఆటతో మైదానాన్ని దద్దరిల్లచేయగలని నిరూపించడానికి మహిళా క్రికెటర్లు అమితోత్సాహంతో వేచి చూస్తున్నారు. వారందరికీ ఆస్ట్రేలియా వేదిక కానుంది. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలో మహిళల టి20 ప్రపంచకప్ మొదలుకానుంది. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్ అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8న విఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇప్పటికే టైటిల్ వేట కోసం 10 జట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. భారత మహిళల జట్టు మూడు వారాల క్రితమే ఆస్ట్రేలియా చేరుకుంది. మూడుసార్లు సెమిస్లోకి 11 ఏళ్ల క్రితం 2009లో తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ జరిగింది. తర్వాతి ఏడాది రెండోసారి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. 2012 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆరు టి20 ప్రపంచకప్‌లలో భారత్ మూడుసార్లు సెమీఫైనల్స్‌లోకి (2009, 2010, 2018) దూసుకెళ్లింది. అయితే టైటిల్ సమరానికి ఒక్కసారీ అర్హత పొందలేకపోయింది. కానీ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటడమే కాకుండా కప్పుతో తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉంది. హర్మన్ పంజా వరుసగా ఏడో ప్రపంచకప్‌లో ఆడుతోన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనుభవం ఈసారి జట్టుకు పెద్ద అనుకూలాంశం. టీనేజర్‌గా 2009లో తొలి వరల్డ్ కప్ ఆడిన ఈ పంజాబీ అమ్మాయి ఇప్పుడు జట్టులో సీనియర్ సభ్యురాలిగా మారిపోయింది. 30 ఏళ్ల హర్మన్‌ప్రీత్ వరుసగా రెండో ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ధనాధన్ ఆటకు పెట్టింది పేరైన హర్మన్ క్రీజులో నిలదొక్కుకొని బ్యాట్ ఝళిపించిందంటే స్కోరు బోర్డుపై పరుగుల వరద పారాల్సిందే. 2018 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌ప్రీత్ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 103 పరుగులు చేసింది. టి20ల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా కెరీర్లో 109 టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న హర్మన్ 2,156 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫీల్డర్‌గా 42 క్యాచ్‌లు పట్టిన హర్మన్ బంతితోనూ మెరిసి 29 వికెట్లు పడగొట్టింది. గత ప్రపంచకప్‌లో దొర్లిన పొరపాట్లను పునరావృతం చేయకుండా... పక్కా ప్రణాళికతో ఆడి... హర్మన్ నాయకత్వానికి ఇతర సభ్యుల ప్రతిభ తోడైతే భారత్ ఈసారి అద్భుతం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాన్న ప్రోత్సాహం.. 1989లో పంజాబ్‌లోని మోగా జిల్లాలో మార్చి 8న జన్మించిన హర్మన్‌కు క్రికెట్ కష్టాలేవీ లేవనే చెప్పాలి. హర్మన్ తండ్రి హర్మీందర్ సింగ్ భుల్లర్ తనూ క్రికెటర్ కావడంతో కూతురు ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. హర్మన్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో స్థానిక కోచ్ కమల్దీష్ సింగ్ కూడా కీలకపాత్ర పోషించారు. వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణించి 19 ఏళ్లకే భారత సీనియర్ జట్టులో చోటు పొందిన హర్మన్ ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ హోదాలో ప్రస్తుతం జట్టును ముందుండి నడిపించే బాధ్యతను నిర్వర్తిస్తోంది. బంతిని చూడటం... బలంగా బాదడమే హర్మన్‌కు తెలిసిన విద్య. భారత మాజీ ఓపెనర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వీరాభిమాని అయిన హర్మన్.. 2017 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై (115 బంతుల్లో 171 నాటౌట్; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చింది. తలో చేయి వేస్తేనే.. జట్టు క్రీడ అయిన క్రికెట్లో ప్రతిసారీ ఒకరిద్దరి ప్రతిభ కారణంగా గెలవలేం. భారత మహిళల జట్టు తొలిసారి విశ్వవిజేతగా అవతరించాలంటే ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్‌కు ఆమె సహచరులు కూడా తమ నైపుణ్యంతో తోడ్పాటు అందించాల్సిందే. ముందుగా ఓపెనర్లు స్మృతి మంధాన, 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చి గట్టి పునాది వేస్తే... ఆ తర్వాత 19 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ తదితరులు ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు. ఇక బౌలింగ్‌లో సీనియర్ పేసర్ శిఖా పాండే, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, పూజ వస్త్రకర్, స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ విజృంభిస్తే భారత్ జైత్రయాత్రను ఎవరూ ఆపలేరు. ఏ జట్టు కెప్టెన్ ఎవరంటే... ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ న్యూజిలాండ్: సోఫీ డివైన్ శ్రీలంక: చమరి ఆటపట్టు బంగ్లాదేశ్: సల్మా ఖాతూన్ ఇంగ్లండ్: హీథెర్ నైట్ పాకిస్తాన్: బిస్మా మారూఫ్ దక్షిణాఫ్రికా: డేన్ వాన్ నికెర్క్ వెస్టిండీస్: స్టెఫానీ టేలర్ థాయ్‌లాండ్: సొర్నారిన్ టిపోచ్ ► 7 - ప్రస్తుతం జరగబోయేది ఏడో టి20 ప్రపంచకప్. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) చాంపియన్‌గా నిలిచింది. ఒక్కోసారి ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2018) విజేతగా నిలిచాయి. ► 13- గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ► ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ‘ఎ’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్)... ‘బి’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, థాయ్‌లాండ్) ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు మార్చి 8న ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి. ► ప్రపంచకప్ మ్యాచ్‌లు మొత్తం నాలుగు నగరాల్లోని (పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా) ఆరు మైదానాల్లో జరుగుతాయి. టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రైజ్‌మనీ విజేత జట్టుకు 10 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు. – కరణం నారాయణ, సాక్షి క్రీడా విభాగం -
స్మృతి... టాప్ ర్యాంక్ చేజారె
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ‘టాప్’లో ఉన్న స్మృతి మంధాన రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో సోమవారం ముగిసిన వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమవ్వడం ఆమె వ్యక్తిగత ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. ప్రస్తుతం స్మృతి 755 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... 759 పాయింట్లతో న్యూజిలాండ్ ప్లేయర్ అమీ సాటర్త్‌వెయిట్ మొదటి ర్యాంక్‌కు ఎగబాకింది. క్రికెట్ కెరీర్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సారథి మిథాలీ రాజ్ ఒక స్థానాన్ని కోల్పోయి ఏడో ర్యాంక్‌కు పరిమితం కాగా... టి20 కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 17వ స్థానంలో నిలిచింది. -
జయము జయము
క్రీడా మంత్రిత్వ శాఖ ఈసారి ‘పద్మ’ అవార్డుల కోసం అందరూ మహిళల్నే నామినేట్ చేసింది! మొత్తం 9 మంది. ‘పద్మ విభూషణ్’కు మేరీ కోమ్ (బాక్సింగ్), ‘పద్మ భూషణ్’కు పి.వి.సింధు (బ్యాడ్మింటన్), ‘పద్మశ్రీ’కి వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), రాణి రాంపాల్ (హాకీ), సుమ శిరూర్ (షూటింగ్), మనికా బత్రా (టేబుల్ టెన్నిస్), కవలలు తాషి, నంగ్షీ మాలిక్ (పర్వతారోహణ) నామినేట్ అయ్యారు. ‘పద్మ విభూషణ్’గా నామినేట్ అయిన మేరీ కోమ్.. బాక్సింగ్‌లో ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్. పద్మభూషణ్ (2013), పద్మ శ్రీ (2006) గ్రహీత కూడా. ఇక మిగిలింది పద్మ విభూషణ్! క్రీడల్లో ఒక మహిళ పద్మ విభూషణ్‌కు నామినేట్ అవడం ఇదే మొదటిసారి. ఇంతవరకు విశ్వనాధన్ ఆనంద్ (2007), సచిన్ టెండూల్కర్ (2008), సర్ ఎడ్మండ్ హిల్లరీ (చనిపోయాక 2008లో) లకు మాత్రమే స్పోర్ట్స్ కేటగిరీలో పద్మవిభూషణ్ లభించింది. ఈ ఏడాది పద్మభూషణ్‌కు నామినేట్ అయిన పి.వి.సింధు 2017లోనూ నామినేట్ అయ్యారు కానీ, విజేత కాలేకపోయారు. 2015లో ఆమెకు పద్మ శ్రీ దక్కింది. ‘భారతరత్న’ మనదేశంలో అత్యున్నత పురస్కారం. తర్వాతవి.. వరుసగా ‘పద్మ విభూషణ్’, ‘పద్మ భూషణ్’, ‘పద్మ శ్రీ’. ఏటా ‘రిపబ్లిక్ డే’కి ఒక రోజు ముందు ఈ అవార్డులను ప్రకటిస్తారు. అంతకన్నా ముందు వివిధ రంగాల నుంచి నామినేషన్లు వెళ్తాయి. వాటిలోంచి విజేతలు ఎంపికవుతారు. మేరీ కోమ్కు ఛాన్సుంది! మేరీ కోమ్ (36) రాజ్యసభ సభ్యురాలు కూడా. 2016 ఏప్రిల్‌లో బీజేపీ ప్రభుత్వం ఆమెను ఎంపీగా నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆమె.. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయ్యేందుకు దీక్షగా సాధన చేస్తున్నారు. కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ మణిపురి బాక్సర్‌కు ఉన్న ట్రాక్ రికార్డుని బట్టి ఆమెకు పద్మవిభూషణ్ రావచ్చనే క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. -
మిథాలీని పక్కనపెట్టి...
ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టును మార్చదల్చుకోలేదు. కాబట్టే మిథాలీని తీసుకోలేదు. ఏం చేసినా జట్టు కోసమే’... అత్యంత సీనియర్ బ్యాట్స్‌మన్‌ను తప్పించడంపై ఇదీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వివరణ! ఆమె మాటల్లో ఒకింత అసహనం, కూసింత అహంకారం కూడా కనిపించాయి. ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు 2009నుంచి ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి 24 మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలో మిథాలీ రాజ్ బరిలోకి దిగింది. అత్యంత కీలకమైన సెమీ ఫైనల్లో ఆమెకు అవకాశం ఇవ్వకుండా కెప్టెన్ చెబుతున్న కారణం ఆశ్చర్యపరిచేదే. రెండు ఇన్నింగ్స్‌లు ఆడితే రెండు అర్ధసెంచరీలతో రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన మిథాలీ విలువను గుర్తించకపోవడం విచారకరం. నిజంగా చెప్పాలంటే మిథాలీ అవసరం ఈ మ్యాచ్‌లో అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. నెమ్మదైన పిచ్, భారీ షాట్లకు అవకాశం లేదు, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ తెలివిగా సింగిల్స్ ద్వారానే ఎక్కువగా పరుగులు రాబట్టాల్సిన స్థితి. ఈ పాత్రను మాజీ కెప్టెన్ కంటే ఎవరూ సమర్థంగా పోషించలేరు. తమ జట్టును గెలిపించడంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోన్స్, స్కివర్ ఆడిన తీరు చూస్తే మిథాలీ ఉంటే బాగుండేదని కచ్చితంగా అనిపిస్తుంది. తనతో పాటు స్మృతి, జెమీమా భారీ షాట్లతో చెలరేగితే చాలు విజయం సాధ్యమని నమ్మిన హర్మన్... కాస్త నెమ్మదిగా ఆడే మిథాలీ శైలి సరిపోదని భావించినట్లుంది. భారత్ తమ నాలుగు లీగ్ మ్యాచ్‌లను ప్రొవిడెన్స్‌లో ఆడి భారీ స్కోర్లు చేసింది. దానికి పూర్తి భిన్నంగా ఉన్న పిచ్‌పై చేతులెత్తేసింది. ఇక్కడ ఎలా ఆడాలో అర్థం చేసుకోకుండా గుడ్డిగా షాట్లు ఊపి ఔటైన హర్మన్, వేద, అనూజ పరాజయాన్ని ఆహ్వానించారు. ఈ టోర్నీలో భారత్ తరఫున టాప్–4 మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఐదో స్థానంనుంచి చివరి వరకు ఏ ఒక్కరినీ నమ్మలేని స్థితి. సెమీస్‌తో కలిపి ఐదు ఇన్నింగ్స్‌లలో 24 పరుగులు మాత్రమే చేసిన వేద కృష్ణమూర్తి ఘోరంగా విఫలమైంది. హర్మన్ ఓపెనర్‌గా నమ్మిన తాన్యా 3 ఇన్నింగ్స్‌లలో కలిపి చేసింది 22 పరుగులు. ఇలాంటి స్థితిలో ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌ను బౌలర్ కోసం త్యాగం చేయడం ఆత్మహత్యాసదృశం. అద్భుతమైన స్ట్రయిక్ రేట్ లేకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలకుండా నిలువరించగల సత్తా హైదరాబాదీకి ఉంది. ఒక దశలో 89/2తో ఉన్న జట్టు 112 పరుగులకే ఆలౌట్ కావడం చూస్తే చివరి వరుస ప్లేయర్లతో కలిసి మిథాలీ అదనపు పరుగులు జోడిస్తే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదేమో. ప్రాధాన్యత లేని గత మ్యాచ్‌లో మోకాలి గాయంతో ముందు జాగ్రత్తగా మిథాలీ విశ్రాంతి తీసుకుంది. ఆమె స్థానంలో వచ్చిన స్పిన్నర్ అనూజను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించారు. దీప్తి, రాధ, పూనమ్, హేమలత రూపంలో నలుగురు రెగ్యులర్ స్పిన్నర్లు ఉండగా ఐదో స్పిన్నర్‌ను తీసుకోవడంలో అర్థం లేదు. ఆమె కోసం మిథాలీని పక్కన పెట్టడంతో ఒక బ్యాట్స్‌మెన్ లోటు స్పష్టంగా కనిపించింది. 3.1 ఓవర్లలో 27 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయిన అనూజ బ్యాటింగ్‌లో తొలి బంతికే వెనుదిరిగింది. సెమీస్‌లో జెమీమాను కూడా ఆరో స్పిన్నర్‌గా వాడారు. టీమ్‌లో ఉన్న ఏకైక పేసర్ అరుంధతి రెడ్డితో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం కెప్టెన్సీ లోపాలను చూపించింది! పిచ్‌ను బట్టి గెలుపు కోసం పూర్తిగా స్పిన్నే జట్టు నమ్ముకుంటే ఆ పేసర్నైనా పక్కన పెట్టాల్సింది. మొత్తంగా పేలవమైన ఆటతో పాటు తప్పుడు వ్యూహాలతో హర్మన్ బృందం మంచి అవకాశం కోల్పోయింది. వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లో ఓడినా సగర్వంగా తిరిగొచ్చిన టీమిండియాకు స్వయంకృతంతో దక్కిన ఈ పరాజయం మాత్రం చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు. ‘మిథాలీని తప్పించాలనే మా నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కొన్నిసార్లు వ్యూహాలు ఫలిస్తాయి. మరికొన్ని సార్లు తారుమారవుతాయి. ఏం చేసినా జట్టు కోసమే. టోర్నీలో జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. కనీసం 140 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండేది. మాది ఇంకా యువ జట్టే. మానసికంగా బలంగా ఉంటూ ఒత్తిడిలో ఎలా ఆడాలో ఇక ముందు నేర్చుకుంటాం’ – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత కెప్టెన్ – సాక్షి, క్రీడా విభాగం -
మంధనాధన్.. స్మృతి సుడిగాలి ఇన్నింగ్స్!
జట్టు సెమీఫైనల్ చేరినా...కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్ చాటుకున్నా... స్పిన్నర్లు మాయాజాలంతో కట్టిపడేస్తున్నా... టీమిండియాకు ఒక్క లోటు కనిపించింది! అదే మెరుపు తీగ స్మృతి మంధాన బ్యాట్ నుంచి తుఫాన్ ఇన్నింగ్స్ లేకపోవడం! ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌లోఈ ముచ్చటా తీరింది...!స్మృతి అసలు సిసలు ధాటైన ఆట బయటకు వచ్చింది. అంతే... మిగతాదంతా ఎప్పటిలాగే సాగిపోయింది. భారత్ జోరుకు కంగారూలు తోకముడిచారు. ప్రావిడెన్స్: మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మరో ఘన విజయం. ఎడమ చేతివాటం ఓపెనర్ స్మృతి మంధాన (55 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు స్పిన్నర్ల మాయాజాలం తోడైన వేళ కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మన జట్టు 48 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతికి తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్ (3/15), రాధా యాదవ్ (2/13), పూనమ్ యాదవ్ (2/28), దీప్తిశర్మ (2/24) ఉచ్చులో చిక్కిన ఆసీస్ 19.4 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. ఎలీస్ పెర్రీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో సెమీస్ చేరిన వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో ఒకదానితో తలపడనుంది. అహో స్మృతి... హర్మన్ హల్చల్ భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరే రెండంకెల పరుగులు చేశారు. అయినా, జట్టు అంత స్కోరుకు వెళ్లిందంటే కారణం స్మృతి, హర్మన్‌ప్రీత్. ఓపెనర్‌గా వచ్చిన తాన్యా భాటియా (2) సహా విధ్వంసక జెమీమా రోడ్రిగ్స్ (6), వేదా కృష్ణమూర్తి (3) నిరాశపర్చినా, వీరిద్దరి వీర విహారంతో ఆ ప్రభావం కనిపించలేదు. ముందునుంచే జోరు చూపిన స్మృతికి... హర్మన్ రాకతో మరింత బలం వచ్చినట్లైంది. ఇద్దరిలో కెప్టెనే ధాటిగా ఆడింది. మంచి టైమింగ్‌తో బౌండరీలు, భారీ సిక్స్‌లు కొట్టింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 42 బంతుల్లోనే 68 పరుగులు రాబట్టడంతో 13.2 ఓవర్లలో జట్టు స్కోరు 117/2కు చేరింది. పరిస్థితి చూస్తే టీమిండియా 180 పైనే లక్ష్యం విధించేలా కనిపించింది. అయితే, కిమ్మిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన హర్మన్... మరో షాట్‌కు యత్నించి అవుటైంది. ఓవైపు వికెట్లు పడుతున్నా మంధాన దూకుడు కొనసాగించింది. ఈ క్రమంలో శతకం అందుకుంటుదేమో అనిపించింది. కానీ, షుట్ ఓవర్లో లాంగాన్ వైపు ఆమె కొట్టిన షాట్‌ను ఎలీస్ పెర్రీ క్యాచ్ పట్టి ఆ అవకాశం లేకుండా చేసింది. లోయరార్డర్ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో చివరి ఐదు ఓవర్లలో భారత్ 39 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్ల జోరు... భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అలీసా హీలీ... భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడి బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆసీస్ ముందే డీలాపడింది. ఓపెనర్లు ఎలీసా విలానీ (6), బెతానీ మూనీ (19)లను వరుస బంతుల్లో ఔట్ చేసి దీప్తిశర్మ మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చింది. ఆష్లే గార్డ్నర్ (20), రాచెల్ హేన్స్ (8)లను పూనమ్ యాదవ్ పెవిలియన్ చేర్చింది. కెప్టెన్ మెఘాన్ లానింగ్ (10)ను రాధా యాదవ్ వెనక్కు పంపింది. పెర్రీ బ్యాట్ ఝళిపించినా అప్పటికే పరిస్థితి ఆసీస్ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ మిథాలీ రాజ్‌కు విశ్రాంతినిచ్చింది. పేసర్ మాన్సి జోషి స్థానంలో తెలుగమ్మాయి అరుంధతీరెడ్డిని ఆడించింది. మరో పేసర్ పూజా వస్త్రకర్ గాయంతో ప్రపంచ కప్‌నకు దూరమైంది. ►7 భారత్‌కు టి20ల్లో ఇది వరుసగా ఏడో విజయం. గతంలో రెండు సార్లు వరుసగా ఆరేసి మ్యాచ్‌లు నెగ్గింది. ►4 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు అందుకున్న రెండో ఫీల్డర్ వేద కృష్ణమూర్తి ►1 మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్ ఇదే. దీనికిముందు భారత్ ఆడిన 24 మ్యాచ్‌ల్లోనూ మిథాలీ భాగంగా ఉంది. ►31 టి20 ప్రపంచ కప్‌లో స్మృతి మంధాన వేగవంతమైన అర్ధశతకం (31 బంతుల్లో) నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌పై 33 బంతుల్లో సాధించింది. -
నేడే మహిళల చాలెంజ్ మ్యాచ్
ముంబై: మహిళా క్రికెట్లో మరో ముందడుగుగా పేర్కొంటున్న తొలి ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ మంగళవారం వాంఖెడే మైదానంలో జరగనుంది. పురుషుల జట్ల తొలి క్వాలిఫయర్‌కు ముందుగా మధ్యా హ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్నోవాకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్నారు. భారత మేటి క్రీడాకారిణి మిథాలీరాజ్... సూపర్నోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ స్టార్లు సుజీ బేట్స్ (న్యూజిలాండ్), అలీసా హీలీ, మూనీ, పెర్రీ, షుట్ (ఆస్ట్రేలియా), వ్యాట్ (ఇంగ్లండ్) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. -
హర్మన్ ప్రీత్ కౌర్ 'నంబర్ వన్' ఆట
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయం... సెమీఫైనల్లో ఆద్యంతం అద్భుతంగా ఆడిన మిథాలీ సేన ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇది మిథాలీ సేనకు అపూర్వమైన విజయం. హార్డ్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్(171 నాటౌట్;115 బంతుల్లో 20 ఫోర్లు, ఏడు సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడి ఆస్ట్రేలియాను కోలుకోనీయకుండా చేసింది.వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆపై ఆసీస్ ను 40.1 ఓవర్లలో 245 పరుగులకు కట్టడి చేసి ఆదివారం ఇంగ్లండ్ తో జరిగే తుది పోరుకు భారత్ అర్హత సాధించింది. విశేషాలు.. మహిళా ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వారి జాబితాలో హర్మన్ ప్రీత్ కౌరే 'నంబర్ వన్'. సెమీస్ లో ఆస్ట్రేలియాపై కౌర్ అజేయంగా సాధించిన 171 పరుగులే భారత్ తరపున అత్యధికం. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోరు జాబితాలో హర్మన్ ప్రీత్ కౌర్ ఐదో స్థానం సాధించింది. ఆసీస్ క్రీడాకారిణి బెలిండా క్లార్క్(229నాటౌట్) తొలి స్థానంలో, భారత క్రీడాకారిణి దీప్తిశర్మ(188) రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకూ చూస్తే ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక క్రీడాకారిణి చమారి ఆటపట్టు(178 నాటౌట్) ముందంజలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆటపట్టు అత్యధిక స్కోరు సాధించింది. టీమిండియా ఫైనల్ కు చేరడం రెండో సారి. రెండుసార్లు మిథాలీ నేతృత్వంలోనే భారత్ ఫైనల్ కు చేరడం విశేషం. 2005 లో మిథాలీ కెప్టెన్సీలో భారత్ తుది పోరుకు చేరింది. ఇప్పటివరకూ జరిగిన 11 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ మహిళలు ఫైనల్ కు చేరకపోవడం మూడోసారి మాత్రమే. అంతకుముందు 1993,2009ల్లో ఆసీసీ ఫైనల్ కు అర్హత సాధించలేదు. ఆసీస్ ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ ను అందుకోగా, రెండుసార్లు రన్నరప్ గా నిలిచింది.