హోవ్: పొట్టి ఫార్మాట్‌లో నిరాశపరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉంది. టి20ల్లో పేలవమైన ఆటతీరుతో హర్మన్‌ప్రీత్ జట్టు 1–2తో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది. కానీ ఇప్పుడు దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామికి ఇది ఆఖరి సిరీస్ కావడంతో సిరీస్ గెలిచి తమ సహచర క్రీడాకారిణికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అమ్మాయిలంతా బాధ్యత కనబరిస్తే గత వైఫల్యాల్ని అధిగమించవచ్చు.
ముందుగా ఆదివారం జరిగే తొలి వన్డేలో శుభారంభం చేస్తే సిరీస్‌పై పట్టుసాధించవచ్చని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. టాపార్డర్‌లో స్మృతి, షఫాలీ సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డితే మిగతా వారికి పని సులువవుతుంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ హీథెర్‌నైట్ గాయంతో దూరమవడం ఇబ్బందికరం. అయితే ఇంగ్లండ్ మంచి ఆల్‌రౌండ్ జట్టు. పైగా టి20 సిరీస్ గెలిచిన ఊపు మీదుంది. ఇదే జోరుతో సొంతగడ్డపై వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లే, డానీ వ్యాట్, మూడోస్థానంలో అలైస్ కాప్సీ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసివస్తోంది. బౌలింగ్‌లోనూ సోఫీ ఎకిల్‌స్టోన్, ఫ్రెయా డెవిస్ భారత బ్యాటర్లపై ప్రభావం చూపగలరు.
Comments
Please login to add a commentAdd a comment