జట్టు సెమీఫైనల్ చేరినా...కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్ చాటుకున్నా... స్పిన్నర్లు మాయాజాలంతో కట్టిపడేస్తున్నా... టీమిండియాకు ఒక్క లోటు కనిపించింది! అదే మెరుపు తీగ స్మృతి మంధాన బ్యాట్ నుంచి తుఫాన్ ఇన్నింగ్స్ లేకపోవడం! ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌లోఈ ముచ్చటా తీరింది...!స్మృతి అసలు సిసలు ధాటైన ఆట బయటకు వచ్చింది. అంతే... మిగతాదంతా ఎప్పటిలాగే సాగిపోయింది. భారత్ జోరుకు కంగారూలు తోకముడిచారు.
ప్రావిడెన్స్: మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మరో ఘన విజయం. ఎడమ చేతివాటం ఓపెనర్ స్మృతి మంధాన (55 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు స్పిన్నర్ల మాయాజాలం తోడైన వేళ కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మన జట్టు 48 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతికి తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్ (3/15), రాధా యాదవ్ (2/13), పూనమ్ యాదవ్ (2/28), దీప్తిశర్మ (2/24) ఉచ్చులో చిక్కిన ఆసీస్ 19.4 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. ఎలీస్ పెర్రీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో సెమీస్ చేరిన వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో ఒకదానితో తలపడనుంది.
అహో స్మృతి... హర్మన్ హల్‌చల్
భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరే రెండంకెల పరుగులు చేశారు. అయినా, జట్టు అంత స్కోరుకు వెళ్లిందంటే కారణం స్మృతి, హర్మన్‌ప్రీత్. ఓపెనర్‌గా వచ్చిన తాన్యా భాటియా (2) సహా విధ్వంసక జెమీమా రోడ్రిగ్స్ (6), వేదా కృష్ణమూర్తి (3) నిరాశపర్చినా, వీరిద్దరి వీర విహారంతో ఆ ప్రభావం కనిపించలేదు. ముందునుంచే జోరు చూపిన స్మృతికి... హర్మన్ రాకతో మరింత బలం వచ్చినట్లైంది. ఇద్దరిలో కెప్టెనే ధాటిగా ఆడింది. మంచి టైమింగ్‌తో బౌండరీలు, భారీ సిక్స్‌లు కొట్టింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 42 బంతుల్లోనే 68 పరుగులు రాబట్టడంతో 13.2 ఓవర్లలో జట్టు స్కోరు 117/2కు చేరింది. పరిస్థితి చూస్తే టీమిండియా 180 పైనే లక్ష్యం విధించేలా కనిపించింది. అయితే, కిమ్మిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన హర్మన్... మరో షాట్‌కు యత్నించి అవుటైంది. ఓవైపు వికెట్లు పడుతున్నా మంధాన దూకుడు కొనసాగించింది. ఈ క్రమంలో శతకం అందుకుంటుదేమో అనిపించింది. కానీ, షుట్ ఓవర్లో లాంగాన్ వైపు ఆమె కొట్టిన షాట్‌ను ఎలీస్ పెర్రీ క్యాచ్ పట్టి ఆ అవకాశం లేకుండా చేసింది. లోయరార్డర్ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో చివరి ఐదు ఓవర్లలో భారత్ 39 పరుగులే చేయగలిగింది.
స్పిన్నర్ల జోరు...
భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అలీసా హీలీ... భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడి బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆసీస్ ముందే డీలాపడింది. ఓపెనర్లు ఎలీసా విలానీ (6), బెతానీ మూనీ (19)లను వరుస బంతుల్లో ఔట్ చేసి దీప్తిశర్మ మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చింది. ఆష్లే గార్డ్‌నర్ (20), రాచెల్ హేన్స్ (8)లను పూనమ్ యాదవ్ పెవిలియన్ చేర్చింది. కెప్టెన్ మెఘాన్ లానింగ్ (10)ను రాధా యాదవ్ వెనక్కు పంపింది. పెర్రీ బ్యాట్ ఝళిపించినా అప్పటికే పరిస్థితి ఆసీస్ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ మిథాలీ రాజ్‌కు విశ్రాంతినిచ్చింది. పేసర్ మాన్సి జోషి స్థానంలో తెలుగమ్మాయి అరుంధతీరెడ్డిని ఆడించింది. మరో పేసర్ పూజా వస్త్రకర్ గాయంతో ప్రపంచ కప్‌నకు దూరమైంది.
►7 భారత్‌కు టి20ల్లో ఇది వరుసగా ఏడో విజయం. గతంలో రెండు సార్లు వరుసగా ఆరేసి మ్యాచ్‌లు నెగ్గింది.
►4 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు అందుకున్న రెండో ఫీల్డర్ వేద కృష్ణమూర్తి
►1 మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్ ఇదే. దీనికిముందు భారత్ ఆడిన 24 మ్యాచ్‌ల్లోనూ మిథాలీ భాగంగా ఉంది.
►31 టి20 ప్రపంచ కప్‌లో స్మృతి మంధాన వేగవంతమైన అర్ధశతకం (31 బంతుల్లో) నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌పై 33 బంతుల్లో సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment