హర్మన్‌ప్రీత్ కౌర్
2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్, 2018 టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్, 2020 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్... వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళల క్రికెట్ జట్టు నాకౌట్ దశకు చేరినా టైటిల్ మాత్రం దక్కలేదు. అప్పటి వరకు బాగా ఆడుతూ వచ్చిన మన అమ్మాయిలు కీలక దశలో చేతులెత్తేశారు. బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నట్లు కనిపించినా... ఓవరాల్‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్ల స్థాయికి మనం ఇంకా చేరుకోలేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ అంతరం తగ్గాల్సిన ఆవశ్యకత ఉందని భారత టి20 టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెబుతోంది.
ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్‌నకు మరో ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో ఈ టోర్నీ జరగనుంది. గత మూడు ఐసీసీ టోర్నీల ఫలితాలను చూసుకుంటే వచ్చే మెగా టోర్నీలోగా పలు లోపాలను మనం సరిదిద్దుకోవాల్సి ఉందని టీమ్ అగ్రశ్రేణి బ్యాటర్, టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (వన్డే టీమ్‌కు మిథాలీ రాజే కెప్టెన్) అభిప్రాయపడింది. ఇందులో ఫీల్డింగ్, ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడంతో పాటు పేసర్లను తీర్చిదిద్దడం కూడా కీలకమని ఆమె చెబుతోంది. వివిధ అంశాలపై హర్మన్ అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
భారత జట్టు ఫిట్‌నెస్‌పై...
దురదృష్టవశాత్తూ మనం ఇలాంటి అంశాలు చాలా ఆలస్యంగా మొదలు పెడతాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్ల విషయంలో ఫిట్‌నెస్ వారి సంస్కృతిలో ఒక భాగంలా ఉంది. ఇతర జట్లతో పోలిస్తే ప్రతిభపరంగా బ్యాటింగ్, బౌలింగ్‌లలో కూడా మన జట్టు ఎంతో మెరుగ్గా ఉంది. కానీ ఫిట్‌నెస్ మాత్రమే మమ్మల్ని వెనక్కి లాగుతోంది. ఇప్పుడు మన అమ్మాయిల్లో అందరిలోనూ దీనిపై శ్రద్ధ పెరిగింది కాబట్టి శ్రమిస్తున్నారు. వారికి కూడా తమ బాధ్యత అర్థమైంది. ఒక్క రోజులో ఇదంతా మారిపోదు. సుదీర్ఘ సమయం పాటు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
మన దేశవాళీ క్రికెట్‌పై...
ఇది మరో పెద్ద లోపం. సరిగ్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకంటే మనం ఈ విషయంలో కనీసం ఐదారేళ్లు వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు కొంత మారుతున్నా.... కొన్నాళ్ల క్రితం వరకు కూడా దేశవాళీ క్రికెట్‌లో ఇస్తున్న ప్రదర్శనకు, అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి వారు ఆడుతున్న తీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. ఇటీవల బీసీసీఐ 30 మంది మహిళా క్రికెటర్లకు ప్రత్యేక షెడ్యూల్ తయారు చేసి ఇస్తుండటంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనను బట్టి జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే వారు తడబాటుకు గురి కావడం కొంత తగ్గింది. తమ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ ఏం ఆశిస్తోందో వారికి అర్థమవుతోంది. నిజాయితీగా చెప్పాలంటే దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఎలా ఉండాలో అలా మాత్రం ఇప్పటికీ లేదు. అందుకే ఐదారేళ్లు వెనుకబడిన పోలిక తెస్తున్నాను. దేశవాళీ స్థాయి పెరిగితేనే అంతర్జాతీయ స్థాయిలో కూడా బాగా ఆడగలరని నా అభిప్రాయం.
పేస్ బౌలింగ్ బలహీనతలపై...
ఒకటి, రెండేళ్ల క్రితం పేస్ బౌలర్లను తీర్చిదిద్దడంపై మనం దృష్టి పెట్టి ఉంటే ఇంతగా స్పిన్నర్లను నమ్ముకునే అవసరం రాకపోయేది (ప్రపంచకప్‌లో ఒకే ఒక పేసర్ శిఖా పాండే అన్ని మ్యాచ్‌లు ఆడగా, అరుంధతి రెడ్డి రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగింది). జట్టు అవసరాలను బట్టి చూస్తే మనకు కనీసం ముగ్గురు పేస్ బౌలర్ల అవసరం ఉంది. అయితే వారిలో ఏమాత్రం సత్తా ఉందనేది కూడా చూడాలి. ఈ విభాగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బౌలర్లను దాటి బయట సరైన ప్రతిభను అన్వేషించాలి. వచ్చే రెండేళ్లలో నాణ్యమైన పేసర్లు మనకు లభిస్తారని నమ్ముతున్నా.
స్వీయ బ్యాటింగ్ వైఫల్యాలు, కెప్టెన్సీపై...
టి20 జట్టు కెప్టెన్సీ నాకు భారం కాదు. నా బ్యాటింగ్‌పై దాని ప్రభావం ఉందంటే అంగీకరించను (ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 30 పరుగులే చేసిన హర్మన్ టి20ల్లో ఆఖరిసారిగా 16 నెలల క్రితం అర్ధ సెంచరీ నమోదు చేసింది. ఫిబ్రవరి 2018 తర్వాత ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ చేయలేదు). బయటినుంచి చూస్తే నేను విఫలమైనట్లు కనిపించవచ్చు కానీ నాకు అలాంటి భావన ఏమీ లేదు. నా బ్యాటింగ్‌పై నాకు విశ్వాసం ఉంది. గణాంకాలు వాటిని సరిగా విశ్లేషించలేవు. వీటి వల్ల నా నైతిక స్థయిర్యం దెబ్బతినదు. కెప్టెన్సీని నేను బాగా ఆస్వాదిస్తున్నాను. అన్ని విషయాల్లో భాగమవుతూ చురుగ్గా నా బాధ్యతలు నెరవేరుస్తున్నా. గతంలో నా బ్యాటింగ్ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. సారథ్యం కారణంగా వ్యక్తిగతంగానూ నాలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఇప్పుడు నా గురించి మాత్రమే కాకుండా ఇతర అన్ని అంశాల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత నాపై ఉంది.
స్పిన్‌పై అతిగా ఆధారపడటంపై...
ఇటీవల టి20 ప్రపంచకప్‌లో స్పిన్‌ను అనుకూలంగా లేని పిచ్‌లపై కూడా వారినే నమ్ముకున్నాం. క్రికెట్ వ్యూహాలపరంగా చెప్పాల్సి వస్తే అది ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. అయితే అలాంటి పెద్ద టోర్నీలో ఒక జట్టుకు తమ బలాలు, బలహీనతల గురించి తెలిసి ఉండటం, బలాన్ని సమర్థంగా వాడుకోవడం కూడా కీలకం. ప్రస్తుత స్థితిలో స్పిన్నర్లు మా జట్టు బలం. అందుకే తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment