
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో (ICC Under 19 Women's T20 World Cup 2025) భారత్ (India) వరుసగా ఐదో విజయం సాధించింది. స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 28) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, తెలుగమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాట్‌తో విధ్వంసకర శతకం బాదిన త్రిష.. ఆతర్వాత బంతితోనూ చెలరేగి మూడు వికెట్లు పడగొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న త్రిష.. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.
అనంతరం 209 పరుగల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆయూషి శుక్లా 4, వైష్ణవి శర్మ, గొంగడి త్రిష తలో మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్ పతనాన్ని శాశించారు. ఆయూషి, వైష్ణవి శర్మ, త్రిష వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆయూషి 3 ఓవర్లలో 8 పరుగులు.. వైష్ణవి శర్మ 2 ఓవర్లలో 5 పరుగులు.. త్రిష 2 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా 12 పరుగులకు మించి చేయలేదు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.

ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో తలపడిన ఒక్క ప్రత్యర్థి కూడా కనీసం మూడంకెల మార్కును చేరుకోలేకపోయింది. వెస్టిండీస్ 44, మలేసియా 31, శ్రీలంక 58, బంగ్లాదేశ్ 64, తాజాగా స్కాట్లాండ్ 58 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment