పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన | Nigeria Beat New Zealand By 2 Runs In Under 19 Womens T20 World Cup | Sakshi
Sakshi News home page

పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన

Jan 20 2025 1:21 PM | Updated on Jan 20 2025 1:46 PM

Nigeria Beat New Zealand By 2 Runs In Under 19 Womens T20 World Cup

మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌కప్‌-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో నైజీరియా న్యూజిలాండ్‌పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్‌ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్‌ సీనియర్‌ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. గ్రూప్‌-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్‌ ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్‌ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌), మిడిలార్డర్‌ బ్యాటర్‌ లిల్లియన్‌ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

ఎనిమిదో నంబర్‌ బ్యాటర్‌ ఒమోసిగో ఎగువాకున్‌ (4 బంతుల్లో 9 నాటౌట్‌; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్‌ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్‌ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్‌ తరఫున బౌలింగ్‌ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్‌ తీశారు.

అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్‌ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్‌ కావడంతో న్యూజిలాండ్‌ కోలుకోలేకపోయింది. 

చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్‌ లిల్లియన్‌ ఉడే అద్భుతంగా బౌల్‌ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్‌తో రాణించిన నైజీరియా కెప్టెన్‌ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్‌-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్‌లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్‌-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్‌ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్‌ ఆడుతుంది. జనవరి 23న భారత్‌.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement