
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ 2025 (ICC Under 19 Women's T20 World Cup 2025) చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) ఆస్ట్రేలియాకు (Australia) షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు శ్రీలంక ఓటమి రుచి చూపించింది.
మలేసియాలోకి బంగి వేదికగా ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు శ్రీలంక సైతం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు.
గ్రూప్ దశలో శ్రీలంక.. మలేసియా, వెస్టిండీస్ జట్లపై విజయాలు సాధించినప్పటికీ భారత్ చేతిలో ఘోరంగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆతర్వాత సూపర్-6లో తప్పక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కావడం శ్రీలంక సెమీస్ ఆశలను గల్లంతు చేసింది.
తాజాగా శ్రీలంక ఆసీస్‌పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శ్రీలంక ఉన్న గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఫైనల్ ఫోర్‌కు చేరాయి.
జనవరి 31న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీకొట్టనుండగా.. అదే రోజు జరిగే రెండ సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ భారతకాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2023) టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.
లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సంజన కవిండి (19), సుముదు నిసంసల (18), కెప్టెన్ మనుడి ననయక్కార (15), హిరుని హన్సిక (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లిల్లీ బాస్సింగ్‌వైత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. హస్రత్ గిల్, టెగాన్ విలియమ్సన్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. లంక బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో ఒక్కో పరుగు చేసేందుకు నానా ఇబ్బందులు పడింది. చమోది ప్రబోద, ప్రముది మెత్సర, అసేని తలగుణే తలో రెండు వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు.
లిమాంస తిలకరత్న ఓ వికెట్ పడగొట్టింది. లంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కూడా 8 వికెట్ల నష్టానికి 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బే (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెక్‌కియోన్ (10), కెప్టెన్ హ్యామిల్టన్ (10), వికెట్ కీపర్ గ్రేస్ లయన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment