బీసీసీఐకి కొత్త బాస్లు వచ్చారు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజువారీ కార్యకలాపాలు చూసేందుకు సుప్రీం కోర్టు నలుగురితో ఓ కమిటీ నియమించింది. బీసీసీఐ పాలక మండలి సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానాను నియమించింది. ఈ కమిటీకి వినోద్ రాయ్ సారథ్యం వహిస్తారు. సోమవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కొత్త కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు కానీ స్థానం దక్కలేదు. మాజీ మహిళ క్రికెటర్ డయానాకు చోటు లభించింది. మిగిలిన ముగ్గురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు. ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది.
లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయనందుకు సుప్రీం కోర్టు బీసీసీఐపై కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని నియమించింది.