Vikram Limaye
-
ట్యాప్ సిస్టమ్ కేసుకు రూ.643 కోట్ల పరిష్కారం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), దాని మాజీ చీఫ్ విక్రమ్ లిమాయే, ఇతర ఎనిమిది మంది శుక్రవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో ఒక కీలక కేసును పరిష్కరించుకున్నారు. టీఏపీ– ట్యాప్ (ట్రేడింగ్ యాక్సెస్ పాయింట్) సిస్టమ్ లోపాలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలకు సంబంధించిన కేసును రూ. 643 కోట్ల చెల్లింపుల ద్వారా పరిష్కరించుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సెటిల్మెంట్కు సంబంధించి ఇది అత్యధిక మొత్తమే కాకుండా, కో–లొకేషన్ సమస్యతో ఇప్పటికే ఆలస్యం అయిన ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)వేగవంతానికి ఈ చర్య దోహదపడనుంది.‘‘ఆరోపణలను అంగీకరించడం లేదా తిరస్కరించడం లేదా చట్ట ద్వారా పరిష్కరించుకోవడంతో సంబంధం లేకుండా ఒక పరిష్కార ఉత్తర్వు ద్వారా ఈ సమస్య పరిష్కారం అయినట్లు’’ అధికార వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్ఈ, లిమాయేసహా సెబీతో కేసును పరిష్కరించుకున్న వారిలో ఉమేష్ జైన్ జీ, ఎం. షెనాయ్, నారాయణ్ నీలకంఠన్, వీఆర్ నరసింహన్, కమల కే, నీలేష్ తినాయకర్, ఆర్ నందకుమార్, మయూర్ సింధ్వాద్ ఉన్నారు. అసలు ట్యాప్ కేసు ఏమిటి? ట్రేడింగ్ సభ్యులు– ఎన్ఎస్ఈ ట్రేడింగ్ సిస్టమ్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి ట్యాప్ వ్యవస్థను 2008లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో భద్రతా లోపాలు, మెరుగుదలలో జాప్యాలు, ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోకపోవడంలో ఆలస్యం వంటి అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రవేశపెట్టినప్పటికీ, ట్యాప్‌ను ఈక్విటీల కోసం 2019 వరకు, ఇతర విభాగాల కోసం 2020 వరకు వినియోగించడం జరిగింది. దీనిపై సెబీ విచారణ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ‘‘2023 ఫిబ్రవరి 28 నాటి ఎన్సీఎన్ (షోకాజ్ నోటీసు) ద్వారా దరఖాస్తుదారులకు వ్యతిరేకంగా ప్రారంభించిన చర్యలను పూర్తిగా నిలుపుచేయడం జరిగింది’’ అని సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
రెండోసారి బాధ్యతలు కోరుకోవడం లేదు: లిమాయే
న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రెండోసారి బాధ్యతలను చేపట్టాలని కోరుకోవడం లేదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టం చేశారు. లిమాయే పదవీకాలం జూలైలో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో పాలనా పరమైన లోపాలు, కో–లొకేషన్ వ్యవహారంపై సెబీ, సీబీఐ విచారణలు, మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో లిమాయే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నేను రెండవ టర్మ్‌ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. అందువల్ల తిరిగి దరఖాస్తు చేయడంకానీ, ప్రస్తుతం జరుగుతున్న నియామకం ప్రక్రియలో పాల్గొనడం కానీ చేయడం లేదు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపాను. నా పదవీకాలం 2022 జూలై 16వ తేదీతో ముగుస్తుంది’’ అని లిమాయే తెలిపారు. చాలా క్లిష్టమైన కాలంలో సంస్థను నడిపించడానికి, సంస్థను స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి, పాలనా ప్రక్రియ, సమర్థతను మరింత పటిష్టంగా మార్చడానికి, సాంకేతిక పురోగతికి, వ్యాపార వృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎన్ఎస్ఈ చీఫ్‌గా లిమాయే నియామకానికి సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ కొత్త చీఫ్‌గా విక్రమ్ లిమాయే నియామకానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా సుప్రీంకోర్టు జనవరిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం నలుగురు సభ్యులతో కూడిన ఒక కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో విక్రమ్ లిమాయే కూడా ఒక సభ్యుడు. ఈయన ఇంకా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. లిమాయే బీసీసీఐలోని తన విధులను ముగించుకొని అటుపైన ఎన్ఎస్ఈ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. గతేడాది డిసెంబర్లో చిత్ర రామకృష్ణ ఎన్ఎస్ఈ చీఫ్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్ఎస్ఈ బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్రమ్ లిమాయేను ఎన్ఎస్ఈ కొత్త ఎండీ, సీఈవోగా ఎన్నుకుంది. వాటాదారులు ఈయన నియామకానికి మార్చిలోనే ఆమోదం తెలిపారు. ఇప్పుడు తాజాగా సెబీ కూడా లిమాయే నియామకానికి అంగీకారం తెలిపింది. కాగా ఈయన పలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ కమర్షియల్ బ్యాంక్స్, గ్లోబల్ అకౌంటింగ్ సంస్థలతో కలిసి పనిచేశారు. -
ఎన్ఎస్ఈ కొత్త బాస్ ఈయనే!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కొత్త బాస్ గా ఐడీఎఫ్సీ ఎండీ విక్రం లిమాయే ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో సీఈవో , ఎండీగా ఆ యన్ను ఎన్నుకున్నారు. తుది ఆమోదం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఎన్ఎస్ఈ ఎజిఎంకు పంపించారు. రూ.10,000 కోట్లు అంచనాతో ఎన్ఎస్ఈ త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో ఈ అపాయింట్మెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అతని ఎంపిక సరైందనీ, అపార అనుభవం వున్న విక్రం నాయకత్వంలో వ్యాపారం మరింత అభివృద్ధి సాధిస్తుందని కెఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ దేవేన్ చోక్సీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆసియాలోనే అతిపురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) బంపర్ లిస్టింగ్ సాధించింది. దీంతో త్వరలోనే ఐపీవోకు రానున్న ఎన్ఎస్ఈ మరింత అద్భుతమైన విజయం సాధిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఎన్ఎస్ఈ ఛైర్మన్ చిత్రారామకృష్ణన్ ఎన్ఎస్ఇకి గుడ్ బై చెప్పారు. 2018 మార్చి వరకు ఆమె పదవీ సమయం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఆమె తన పదవి నుంచి నిష్క్రమించారు. అల్గో వ్యాపార వ్యవస్థలో కొంతమంది బ్రోకర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇచ్చినట్టుగా ఎన్ఎస్ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ లిస్టింగ్ పొందిన ఎక్స్ఛేంజీలలో ఎన్వైఎస్ఈ, నాస్డాక్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీ, డాయిష్ బోర్స్ వంటివి ఉన్నాయి. -
బీసీసీఐకి కొత్త బాస్‌లు వచ్చారు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజువారీ కార్యకలాపాలు చూసేందుకు సుప్రీం కోర్టు నలుగురితో ఓ కమిటీ నియమించింది. బీసీసీఐ పాలక మండలి సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానాను నియమించింది. ఈ కమిటీకి వినోద్ రాయ్ సారథ్యం వహిస్తారు. సోమవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు కానీ స్థానం దక్కలేదు. మాజీ మహిళ క్రికెటర్ డయానాకు చోటు లభించింది. మిగిలిన ముగ్గురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు. ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయనందుకు సుప్రీం కోర్టు బీసీసీఐపై కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని నియమించింది.