ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా లిమాయే నియామకానికి సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈ కొత్త చీఫ్‌గా విక్రమ్ లిమాయే నియామకానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా సుప్రీంకోర్టు జనవరిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం నలుగురు సభ్యులతో కూడిన ఒక కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో విక్రమ్ లిమాయే కూడా ఒక సభ్యుడు. ఈయన ఇంకా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. లిమాయే బీసీసీఐలోని తన విధులను ముగించుకొని అటుపైన ఎన్‌ఎస్‌ఈ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. గతేడాది డిసెంబర్‌లో చిత్ర రామకృష్ణ ఎన్‌ఎస్‌ఈ చీఫ్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
దీంతో ఎన్‌ఎస్‌ఈ బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్రమ్ లిమాయేను ఎన్‌ఎస్‌ఈ కొత్త ఎండీ, సీఈవోగా ఎన్నుకుంది. వాటాదారులు ఈయన నియామకానికి మార్చిలోనే ఆమోదం తెలిపారు. ఇప్పుడు తాజాగా సెబీ కూడా లిమాయే నియామకానికి అంగీకారం తెలిపింది. కాగా ఈయన పలు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ కమర్షియల్ బ్యాంక్స్, గ్లోబల్ అకౌంటింగ్ సంస్థలతో కలిసి పనిచేశారు.