ఎన్‌ఎస్‌ఈ కొత్త బాస్ ఈయనే!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)కొత్త బాస్ గా ఐడీఎఫ్‌సీ ఎండీ విక్రం లిమాయే ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో సీఈవో , ఎండీగా ఆ యన్ను ఎన్నుకున్నారు. తుది ఆమోదం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఎన్ఎస్ఈ ఎజిఎంకు పంపించారు. రూ.10,000 కోట్లు అంచనాతో ఎన్‌ఎస్‌ఈ త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో ఈ అపాయింట్మెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అతని ఎంపిక సరైందనీ, అపార అనుభవం వున్న విక్రం నాయకత్వంలో వ్యాపారం మరింత అభివృద్ధి సాధిస్తుందని కెఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ దేవేన్ చోక్సీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆసియాలోనే అతిపురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) బంపర్ లిస్టింగ్ సాధించింది. దీంతో త్వరలోనే ఐపీవోకు రానున్న ఎన్‌ఎస్‌ఈ మరింత అద్భుతమైన విజయం సాధిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
కాగా ఇటీవల ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్ చిత్రారామకృష్ణన్ ఎన్ఎస్ఇకి గుడ్ బై చెప్పారు. 2018 మార్చి వరకు ఆమె పదవీ సమయం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఆమె తన పదవి నుంచి నిష్క్రమించారు. అల్గో వ్యాపార వ్యవస్థలో కొంతమంది బ్రోకర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇచ్చినట్టుగా ఎన్‌ఎస్‌ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ లిస్టింగ్ పొందిన ఎక్స్ఛేంజీలలో ఎన్‌వైఎస్‌ఈ, నాస్‌డాక్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీ, డాయిష్ బోర్స్ వంటివి ఉన్నాయి.