సెబీతో ఎన్‌ఎస్‌ఈ, విక్రమ్ లిమాయే సెటిల్మెంట్
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్‌ఎస్‌ఈ), దాని మాజీ చీఫ్ విక్రమ్ లిమాయే, ఇతర ఎనిమిది మంది శుక్రవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో ఒక కీలక కేసును పరిష్కరించుకున్నారు. టీఏపీ– ట్యాప్ (ట్రేడింగ్ యాక్సెస్ పాయింట్) సిస్టమ్ లోపాలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలకు సంబంధించిన కేసును రూ. 643 కోట్ల చెల్లింపుల ద్వారా పరిష్కరించుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సెటిల్‌మెంట్‌కు సంబంధించి ఇది అత్యధిక మొత్తమే కాకుండా, కో–లొకేషన్ సమస్యతో ఇప్పటికే ఆలస్యం అయిన ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)వేగవంతానికి ఈ చర్య దోహదపడనుంది.
‘‘ఆరోపణలను అంగీకరించడం లేదా తిరస్కరించడం లేదా చట్ట ద్వారా పరిష్కరించుకోవడంతో సంబంధం లేకుండా ఒక పరిష్కార ఉత్తర్వు ద్వారా ఈ సమస్య పరిష్కారం అయినట్లు’’ అధికార వర్గాలు తెలిపాయి. ఎన్‌ఎస్‌ఈ, లిమాయేసహా సెబీతో కేసును పరిష్కరించుకున్న వారిలో ఉమేష్ జైన్ జీ, ఎం. షెనాయ్, నారాయణ్ నీలకంఠన్, వీఆర్ నరసింహన్, కమల కే, నీలేష్ తినాయకర్, ఆర్ నందకుమార్, మయూర్ సింధ్వాద్ ఉన్నారు.
అసలు ట్యాప్ కేసు ఏమిటి?
ట్రేడింగ్ సభ్యులు– ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్ సిస్టమ్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి ట్యాప్ వ్యవస్థను 2008లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో భద్రతా లోపాలు, మెరుగుదలలో జాప్యాలు, ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోకపోవడంలో ఆలస్యం వంటి అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రవేశపెట్టినప్పటికీ, ట్యాప్‌ను ఈక్విటీల కోసం 2019 వరకు, ఇతర విభాగాల కోసం 2020 వరకు వినియోగించడం జరిగింది. దీనిపై సెబీ విచారణ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ‘‘2023 ఫిబ్రవరి 28 నాటి ఎన్‌సీఎన్ (షోకాజ్ నోటీసు) ద్వారా దరఖాస్తుదారులకు వ్యతిరేకంగా ప్రారంభించిన చర్యలను పూర్తిగా నిలుపుచేయడం జరిగింది’’ అని సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment