సచిన్ టెండూల్కర్ చొరవతోనే..
న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారీ సెంచరీతో మెరిసి భారత్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు గతంలో ఉన్నత ఉద్యోగం ఇప్పించే విషయంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సాయం చేశాడని మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ డయానా ఎడుల్జి తాజాగా వెల్లడించారు. తొలుత హర్మన్ కు చిన్సస్థాయి ఉద్యోగం ఉండేదని, అపార ప్రతిభ ఉన్న ఆ క్రీడాకారిణికి ఉన్నతమైన ఉద్యోగం రావడంలో సచిన్ చొరవ తీసుకున్నట్లు ఎడుల్జి పేర్కొన్నారు.
'నాకు కౌర్ టాలెంట్ గురించి తెలుసు. జూనియర్ స్థాయి నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నాను. దాంతో ఆమెను ముంబై క్రికెట్ కు మారమని అడిగా. ముంబైకి వస్తే మంచి జాబ్ వస్తుందనే హర్మన్ కు హామీ ఇచ్చా. నార్తరన్ రైల్వేకు ఆడేటప్పుడు ఆమెకు చిన్న ఉద్యోగం మాత్రమే ఉండేది. నేను అప్పట్లో ఆమెకు చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ఢిల్లీకి లేఖ రాశా. అయితే వివిధ కారణాలతో ఆమెకు ఉద్యోగం రాలేదు. కాకపోతే ఇదే విషయంపై సచిన్ కు తెలియజేశా. ఎంపీగా ఉన్న సచిన్.. రైల్వే మంత్రికి లేఖ రాసి హర్మన్ కు ఉన్నతస్థాయి ఉద్యోగం వచ్చేలా చేశారు'అని ఎడుల్జి తెలిపారు.