
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల చేసింది. 2024-25 ఏడాదికి గానూ గ్రేడ్-ఎ, బి, సిలలో చోటు దక్కించుకున్న ప్లేయర్ల పేర్లను సోమవారం వెల్లడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-‘ఎ’లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
మరోవైపు.. రేణుకా ఠాకూర్ (Renuka Thakur), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ గ్రేడ్-‘బి’లో స్థానం పదిలం చేసుకున్నారు. అయితే, బౌలర్ రాజేశ్వర్ గైక్వాడ్‌కు మాత్రం ఈసారి ఈ జాబితాలో చోటు దక్కలేదు.
వాళ్లపై వేటు.. వీరికి తొలిసారి చోటు
ఇక గ్రేడ్-‘సి’లో ఉన్న హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలపై బీసీసీఐ ఈసారి వేటు వేసింది. వర్ధమాన స్టార్లు శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జ్యోత్ కౌర్, ఉమా ఛెత్రిలకు తొలిసారిగా, గ్రేడ్-‘సి’లో చోటు ఇచ్చింది.
ఈ మేరకు.. ‘‘టీమిండియా సీనియర్ వుమెన్ జట్టుకు సంబంధించి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. 2024-2025 సీజన్ (అక్టోబరు 1, 2024-సెప్టెంబరు 30, 2025)గానూ వివరాలు వెల్లడించడమైనది’’ అని బీసీసీఐ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది.
సమీప భవిష్యత్తులో ప్రకటించం
అయితే, పురుషుల సీనియర్ జట్టుకు సంబంధించి సమీప భవిష్యత్తులో వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గురువారం స్పోర్ట్స్ స్టార్‌కు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులకు సంబంధించి మూడు గ్రేడ్‌ల ప్లేయర్ల జీతాలు వేరుగా ఉంటాయి. అయితే, ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం బీసీసీఐ ఈసారి వెల్లడించలేదు.
ఆఖరిసారిగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. గ్రేడ్-‘ఎ’లో ఉన్న ప్లేయర్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్-‘బి’లో ఉన్న క్రికెటర్లకు రూ. 30 లక్షలు, గ్రేడ్-‘సి’లో ఉన్న ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం చెల్లిస్తారు.
అయితే, పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం అసలు ఏమాత్రం లెక్కకాదు. పురుష క్రికెటర్లలో A+ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు(2024-25)
గ్రేడ్-ఎ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ
గ్రేడ్-బి : రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ
గ్రేడ్-సి : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్.
చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!