Women's Day WPL 2023: Is BCCI Doing Enough For Women's Cricket - Sakshi
Sakshi News home page

BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్‌! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా?

Published Tue, Mar 7 2023 1:58 PM | Last Updated on Tue, Mar 7 2023 3:25 PM

Womens Day WPL 2023: Is BCCI Doing Enough For Women Cricket - Sakshi

International Women's Day- BCCI- IPL 2023:భారత క్రికెట్ నియంత్రణ మండలి గత ఆర్నెళ్ల కాలంలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. లింగ వివక్షను రూపుమాపే క్రమంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు గొప్ప ముందడుగు వేసింది. అందులో మొదటిది.. మ్యాచ్‌ ఫీజులు.. అవును.. పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే ఫీజులు అసలు లెక్కలోకే రావు!

దీంతో మిగతా రంగాల మాదిరే క్రికెట్‌లోనూ అమ్మాయిల పట్ల ఉన్న వివక్షను తొలగించాలని.. మ్యాచ్‌ ఫీజుల విషయంలో ఉన్న అంతరాన్ని తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇందుకు అనుగుణంగా గతేడాది అక్టోబరులో బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది.

ఇక నుంచి భారత మహిళల జట్టు కాంట్రాక్ట్‌ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్‌ ఫీజు చెల్లిస్తామని అక్టోబరు 27న బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు బోర్డు తెలిపింది.

మహిళా క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లేలా.. క్రికెటర్లుగా ఎదగాలని కోరుకునే అమ్మాయిల ఆశలకు ఊపిరిలూదుతూ బీసీసీఐ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజును ‘రెడ్‌ లెటర్‌ డే’గా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తమైంది. సచిన్‌ టెండుల్కర్‌, మిథాలీ రాజ్‌ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఆ విషయంలోనూ తొలుత న్యూజిలాండే!
మహిళా క్రికెట్లో తొలి టీ20 లీగ్‌ను ప్రవేశపెట్టింది న్యూజిలాండ్‌. వుమెన్స్‌ సూపర్‌ స్మాష్‌ పేరిట 2007 నుంచి నేటికీ లీగ్‌ను కొనసాగిస్తోంది. తర్వాత వెస్టిండీస్‌ ట్వంటీ20 బ్లేజ్‌ పేరుతో 2012 నుంచి లీగ్‌ను నిర్వహిస్తోంది.

ఇక ఆస్ట్రేలియా.. విజయవంతమైన బిగ్‌బాష్‌ లీగ్‌(పురుషులు)లో మహిళా క్రికెటర్లను భాగం చేసేందుకు 2015లో వుమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ను ప్రవేశపెట్టింది. నాటి నుంచి నేటిదాకా ఈ టోర్నీ జైత్రయాత్ర కొనసాగుతోంది.

ఇంగ్లండ్‌లో చార్లెట్‌ ఎడ్వర్డ్స్ కప్‌(2021 నుంచి), భారత్‌లో వుమెన్స్‌ టీ20 చాలెంజ్‌(2018-2022), వెస్టిండీస్‌లో ట్వంటీ20 బ్లేజ్‌(2012-), వుమెన్స్‌ కరేబియన్‌ లీగ్‌(2022-), జింబాబ్వేలో వుమెన్స్‌ టీ20(2020), పాకిస్తాన్‌లో పీసీబీ ట్రయాంగులర్‌ ట్వంటీ20(2020), సౌతాఫ్రికాలో వుమెన్స్‌ టీ20 సూపర్‌లీగ్‌(2019-), శ్రీలంకలో వుమెన్స్‌ సూపర్‌ ప్రొవెన్షియల్‌ టీ20 టోర్నమెంట్‌(2019-).. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహిళా టీ20 లీగ్‌లు ఉన్నాయి.

అయితే, ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జెమీమా రోడ్రిగెస్‌, పూజా వస్త్రాకర్‌, రిచా ఘోష్‌, పూనమ్‌ యాదవ్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తదితరులు పేరెన్నికగన్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడారు.

ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌
అయితే, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష టీ20లీగ్‌లను తలదన్నేలా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను రూపొందించిన.. బీసీసీఐ కాస్త ఆలస్యంగానైనా వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా (దేశీ, విదేశీ) ఎంతో మంది పురుష క్రికెటర్లకు లైఫ్‌నిచ్చిన ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ను నిర్వహించేందుకు సమాయత్తమైంది.

మార్చి 4, 2023న ముంబై ఇండియన్స్‌-గుజరాత్‌ జెయింట్స్‌ మ్యాచ్‌తో ఈ మహిళా ప్రీమియర్‌ లీగ్‌కు తెరలేచింది. ఇద్దరు భారత కెప్టెన్లు(హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(ముంబై), స్మృతి మంధాన), ముగ్గురు విదేశీ కెప్టెన్లు(మెగ్‌ లానింగ్‌, బెత్‌మూనీ, అలిసా హేలీ) ఈ లీగ్‌లో ఆయా జట్లను ముందుకు నడిపిస్తున్నారు.

హర్షణీయమే కానీ.. కోట్లలో తేడా అంటే దారుణం!
తొలుత మ్యాచ్‌ ఫీజుల విషయం.. ఇప్పుడు ఇలా టీ20 లీగ్‌..  మరి నిజంగానే భారత్‌లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య అంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లేనా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫీజుల విషయంలో సమానత్వాన్ని అమలు చేసేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెండో బోర్డుగా బీసీసీఐ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఆ వ్యత్యాసం అలాగే ఉండిపోవడం, ఈ అంశంపై బీసీసీఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. 

చరిత్ర సృష్టించిన షఫాలీ సేన
2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరిన భారత మహిళల జట్టు.. ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్‌ వరకు చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన అండర్‌-19 మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 టోర్నీలో ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది. యువ కెరటం షఫాలీ వర్మ సారథ్యంలో ఈ అద్భుతం జరిగింది. 

వాళ్లకు కోట్లు.. వీళ్లకు లక్షలు
అయితే, బోర్డు ఇంతవరకు కాంట్రాక్ట్‌ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పురుష క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్‌లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్‌ కేటగిరీలో రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ.. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తోంది. పురుషుల క్రికెట్‌కు ఉన్న ఆదరణ, స్పాన్సర్లు, ప్రేక్షకులు, రేటింగ్‌లు, బ్రాండ్‌ వాల్యూ దృష్ట్యా వారికి అంతమొత్తం చెల్లిస్తున్నారన్న మాట కాదనలేని వాస్తవమే.

ఆరు రెట్లు అధికం
అయితే, ఇరువురి కాంట్రాక్టుల విషయంలో కోట్లల్లో వ్యత్యాసం ఉండటం మరీ దారుణం. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐపై.. పురుషుల క్రికెట్‌ స్థాయికి చేరేలా మహిళా క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇక డబ్ల్యూపీఎల్‌ విషయానికొస్తే.. ఐదు జట్లలో అత్యధికంగా ముగ్గురు విదేశీ కెప్టెన్లే! వేలంలో అత్యధిక 3.40 కోట్ల రూపాయలు.

ఐపీఎల్‌ వేలంలో 18 కోట్ల పైచిలుకు ధర పలికే ఆటగాళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు తక్కువ. ఒకవేళ లీగ్‌ భారీగా సక్సెస్‌ అయితే.. ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ.. కాంట్రాక్ట్‌ విషయంలో మాత్రం బోర్డు తలచుకుంటేనే మహిళా క్రికెటర్ల భవితవ్యం మారుతుంది. ఆట మీద ప్రేమతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వాళ్లు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునే ఆస్కారం ఉంటుంది.

కూతుళ్లను క్రికెటర్లు చేయాలనుకునే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా’’ అంటూ మహిళా శక్తిని చాటేలా గీతం రూపొందించిన బీసీసీఐ.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఓ మ్యాచ్‌ను మైదానంలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన బోర్డు.. వచ్చే ఏడాది తిరిగేలోపు కాంట్రాక్టుల విషయంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిద్దాం!!
-సాక్షి, వెబ్‌డెస్క్‌  

చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్‌
WPL 2023: రెండు ముంబై ఇండియన్స్‌ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement