Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్‌ పేసర్‌పై వేటు | BCCI Announce Squad For West Indies ODIs T20Is, Arundhati Reddy And Shafail Verma Not In The List | Sakshi
Sakshi News home page

Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్‌ పేసర్‌పై వేటు

Published Sat, Dec 14 2024 8:05 AM | Last Updated on Sat, Dec 14 2024 9:18 AM

BCCI Announce Squad For West Indies ODIs T20Is: Arundhati Reddy Miss Out

వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్‌ పేసర్‌ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్‌ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.

అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?
కాగా సొంతగడ్డపై భారత్‌ వెస్టిండీస్‌ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్‌ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. 

నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్‌ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.

వారిద్దరికి తొలిసారి చోటు
ఇక విండీస్‌ సిరీస్‌ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్‌లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్‌లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌరే సారథ్యం వహించనుంది.

టీ20 సిరీస్‌తో ఆరంభం
ముందుగా భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్‌ జరుగుతుంది.

ఇక ఈ రెండు సిరీస్‌లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌కు ఫామ్‌లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్‌కు పరిగణించలేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.  

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: 
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్‌ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్‌.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెపె్టన్‌), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్‌ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్‌ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్‌. 

చదవండి: భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌.. వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement