Arundhati Reddy
-
‘అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావడమే లక్ష్యం’
న్యూఢిల్లీ: భారత్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి 2024లో 5 వన్డేలు ఆడి 8 వికెట్లు పడగొట్టింది. వాటిలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 26 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటిన మ్యాచ్ కూడా ఉంది. ఇదే ఏడాది 7 టి20ల్లో కేవలం 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టింది. ఇందులో వరల్డ్ కప్‌లో తీసిన 7 వికెట్లు కూడా ఉన్నాయి. ఎలా చూసినా భారత మహిళల జట్టు కోణంలో ఇది మెరుగైన ప్రదర్శనే. కానీ అనూహ్యంగా సెలక్టర్లు ఆమెపై వేటు వేశారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లతో పాటు ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా అరుంధతిని ఎంపిక చేయలేదు. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అరుంధతిపై వేటు పడటం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే ఇలాంటివన్నీ తన చేతుల్లో లేవని... తన వైపు నుంచి అత్యుత్తమ ఆటతీరు కనబర్చడమే తాను చేయగలిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత సరిగ్గా ఏం జరిగిందో నాకూ తెలీదు. అయితే ఈ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదు. క్రికెట్ బాగా ఆడటం మాత్రమే నాకు తెలిసిన విద్య. కాబట్టి భారత్ తరఫున ఎప్పుడు అవకాశం దక్కినా అదే చేసి చూపిస్తా. ఏ స్థాయిలో ఏ జట్టు తరఫున ఆడినా మైదానంలోకి దిగగానే జట్టును గెలిపించేందుకే ప్రయత్నిస్తా. మొదటినుంచి నేను క్రికెట్‌ను ఇలాగే ఆడాను’ అని అరుంధతి పేర్కొంది. కోచ్ అండతో... భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఆడిన చాలెంజర్ ట్రోఫీ తనకు కూడా తగిన సవాల్ విసిరిందని... కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి తన జట్టు (టీమ్ ‘ఎ’)ను ఫైనల్ చేర్చడం సంతృప్తిగా ఉందని ఆమె వెల్లడించింది. అయితే ఆటలో ఉండే అనిశ్చితిని ఎదుర్కోవడం అంత సులువు కాదని అరుంధతి అంగీకరించింది. జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో తాను మానసికంగా నిరాశకు లోను కాకుండా తన కోచ్ అర్జున్ దేవ్ అండగా నిలిచారని అరుంధతి గుర్తు చేసుకుంది. బెంగళూరులోని ఎన్ఐసీఈ అకాడమీలో అర్జున్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ‘భారత జట్టుకు ఆడినా ఆడకపోయినా... వేరే ఏ టీమ్‌కు ఆడినా ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా మారాలనే పట్టుదలతో సాధన చేయి అని ఆయన నాకు చెప్పారు. నేను మళ్లీ భారత్‌కు ఆడగలనా లేదా అంటే జవాబివ్వలేను. ప్రస్తుతం ఉండే అనిశ్చితిలో ఏ ప్లేయర్‌కు కూడా అది సాధ్యం కాదు. కానీ ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ క్రికెటర్వు అంటూ ప్రతీ రోజు నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను. అదే నన్ను నడిపిస్తుంది’ అని ఈ హైదరాబాదీ తన మనసులో మాటను చెప్పింది. ఎక్కడైనా ఆట ఒక్కటే... ఇన్నేళ్ల తర్వాత వచ్చిన అనుభవంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోగలిగే ప్రస్తుతం నాకు వచ్చిందని చెప్పగలను. ఇప్పుడు ఏ టీమ్‌కు ఆడినా సీనియర్లలో ఒకరిగా ఉంటున్నాను. ఇది నాకు ఎంతో మేలు చేస్తోంది. జూనియర్ అమ్మాయిలకు కొన్ని విషయాలు నేర్పించే క్రమంలో నేను కూడా చాలా నేర్చుకుంటాను. నా నుంచి మరింత మెరుగైన ప్రదర్శన కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడ ఆడుతున్నాను. ఏ జట్టు కోసం ఆడుతున్నాను అనేది పట్టించుకోకుండా దీనిపైనే దృష్టి పెడుతున్నాను’ అని ఆమె స్పష్టం చేసింది. జట్టు మార్పుతో... దేశవాళీ క్రికెట్లో ఐదేళ్ల పాటు రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రెండేళ్ల క్రితం అరుంధతి రెడ్డి కేరళ జట్టుకు మారింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎన్నో విధాలా ఆలోచించాల్సి వచ్చినా చివరకు ధైర్యం చేసింది. అయితే కేరళకు మారిన తర్వాత అటు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా ఆమె ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను. అయితే గత రెండేళ్లుగా నా ఆటలో ఎంతో మార్పు వచ్చిందనేది వాస్తవం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. కానీ అవి నాకు మేలు చేశాయి. ఇప్పుడు నా ఆటపై నాకు మరింత స్పష్టత రావడంతో టోర్నీలకు సరైన రీతిలో సిద్ధమవుతున్నా. ఆపై ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు నాలో ఓటమిభయం కూడా తగ్గింది’ అని అరుంధతి వివరించింది. ‘అటాకింగ్’పై దృష్టి... ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న అరుంధతి... స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోంది. తన బౌలింగ్‌లో పలు మార్పులు చేసుకుంది. ముఖ్యంగా ఆమె బౌలింగ్‌లో ‘అటాకింగ్’ పెరిగింది. గతంలో బ్యాటర్‌ను ఆడకుండా చేసే లక్ష్యంతో ఆఫ్‌స్టంప్ బయటే వరుసగా బంతులు వేసేది. ఇప్పుడు నేరుగా స్టంప్స్‌పైకే బంతులు గురి పెడుతూ బౌలింగ్ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు ఎదురు దాడి చేసే అవకాశం ఉన్నా...ఈ తరహా బౌలింగే ప్రస్తుతం తన బలంగా మారిందని ఆమె స్పష్టం చేసింది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్‌పై వేటు
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్‌లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్‌తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్‌లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌కు ఫామ్‌లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్‌కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్‌తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ మిస్ -
ఆస్ట్రేలియా బ్యాటర్ల ఊచకోత.. భారత్ ముందు భారీ టార్గెట్
ఆస్ట్రేలియాలో భారత మహిళా జట్టు బౌలర్ల వైఫల్యం కొనసాగుతోంది. పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సైతం భారత బౌలర్లు తీవ్ర నిరాశపరిచారు. మన బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్(95 బంతుల్లో 110, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. గార్డనర్(50), కెప్టెన్ మెక్‌గ్రాత్(56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో ఒక్క అరుంధతి రెడ్డి మినహా మిగతా అందరూ తీవ్ర నిరాశపరిచారు. అరుంధతి తన 10 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని హర్మాన్ సేన భావిస్తోంది. ఇప్పుడు ఆ భారమంతా భారత బ్యాటర్లపైనే ఉంది. -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
WPL 2023: వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు క్రికెటర్? ఎవరు ఏయే జట్లకు ఆడబోతున్నారంటే..
Women Cricketers From Telugu States In WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు మంచి ధర దక్కించుకున్నారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్ షకీల్, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. వేలంలో వీరికి పలికిన ధర, వీరు ఏయే జట్లకు ఆడబోతున్నారన్న అంశాలు సంక్షిప్తంగా.. అంజలి శర్వాణి ►లెఫ్టార్మ్ పేస్ బౌలర్. కర్నూల్ జిల్లా ఆదోని స్వస్థలం. భారత్ తరఫున 6 టి20లు మ్యాచ్‌లు ఆడింది. ►జట్టు: యూపీ వారియర్జ్ ►ధర: 55 లక్షలు సబ్బినేని మేఘన ►బ్యాటర్, స్వస్థలం విజయవాడ. భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడింది. ►జట్టు: గుజరాత్ జెయింట్స్ ►ధర: రూ.30 లక్షలు షబ్నమ్ షకీల్ ►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం విశాఖపట్నం. ఇటీవల అండర్–19 ప్రపంచకప్‌లో ఆడింది. ►జట్టు- గుజరాత్ జెయింట్స్ ►ధర: రూ.10 లక్షల సొప్పదండి యషశ్రీ ►పేస్ బౌలర్. హైదరాబాద్ స్వస్థలం. ఇటీవల అండర్–19 ప్రపంచ కప్‌లో ఆడింది. ►జట్టు: యూపీ వారియర్స్ ►ధర: రూ.10 లక్షలు అరుంధతి రెడ్డి ►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం హైదరాబాద్. భారత్ తరఫున 26 టి20లు ఆడింది. ►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్ ►ధర: రూ.30 లక్షలు వి. స్నేహ దీప్తి ►బ్యాటర్. స్వస్థలం విశాఖపట్నం. భారత్ తరఫున 1 వన్డే, 2 టి20లు ఆడింది. ►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్ ►ధర: రూ.30 లక్షలు. వీరిలో అంజలి శర్వాణి అత్యధికంగా 55 లక్షలు పలికింది. ఇదిలా ఉంటే... అండర్-19 మహిళల ప్రపంచకప్-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మాత్రం వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. WPL Auction 2023: అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి