జాతీయ జట్టు నుంచి తప్పించడం ఆశ్చర్యపర్చింది
బౌలింగ్‌లో పదును పెంచడంపైనే దృష్టి
హైదరాబాద్ మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి మనోగతం
న్యూఢిల్లీ: భారత్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి 2024లో 5 వన్డేలు ఆడి 8 వికెట్లు పడగొట్టింది. వాటిలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 26 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటిన మ్యాచ్ కూడా ఉంది. ఇదే ఏడాది 7 టి20ల్లో కేవలం 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టింది. ఇందులో వరల్డ్ కప్‌లో తీసిన 7 వికెట్లు కూడా ఉన్నాయి.
ఎలా చూసినా భారత మహిళల జట్టు కోణంలో ఇది మెరుగైన ప్రదర్శనే. కానీ అనూహ్యంగా సెలక్టర్లు ఆమెపై వేటు వేశారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లతో పాటు ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా అరుంధతిని ఎంపిక చేయలేదు.
హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అరుంధతిపై వేటు పడటం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే ఇలాంటివన్నీ తన చేతుల్లో లేవని... తన వైపు నుంచి అత్యుత్తమ ఆటతీరు కనబర్చడమే తాను చేయగలిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత సరిగ్గా ఏం జరిగిందో నాకూ తెలీదు.
అయితే ఈ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదు. క్రికెట్ బాగా ఆడటం మాత్రమే నాకు తెలిసిన విద్య. కాబట్టి భారత్ తరఫున ఎప్పుడు అవకాశం దక్కినా అదే చేసి చూపిస్తా. ఏ స్థాయిలో ఏ జట్టు తరఫున ఆడినా మైదానంలోకి దిగగానే జట్టును గెలిపించేందుకే ప్రయత్నిస్తా. మొదటినుంచి నేను క్రికెట్‌ను ఇలాగే ఆడాను’ అని అరుంధతి పేర్కొంది.
కోచ్ అండతో...
భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఆడిన చాలెంజర్ ట్రోఫీ తనకు కూడా తగిన సవాల్ విసిరిందని... కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి తన జట్టు (టీమ్ ‘ఎ’)ను ఫైనల్ చేర్చడం సంతృప్తిగా ఉందని ఆమె వెల్లడించింది. అయితే ఆటలో ఉండే అనిశ్చితిని ఎదుర్కోవడం అంత సులువు కాదని అరుంధతి అంగీకరించింది.
జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో తాను మానసికంగా నిరాశకు లోను కాకుండా తన కోచ్ అర్జున్ దేవ్ అండగా నిలిచారని అరుంధతి గుర్తు చేసుకుంది. బెంగళూరులోని ఎన్‌ఐసీఈ అకాడమీలో అర్జున్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ‘భారత జట్టుకు ఆడినా ఆడకపోయినా... వేరే ఏ టీమ్‌కు ఆడినా ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా మారాలనే పట్టుదలతో సాధన చేయి అని ఆయన నాకు చెప్పారు.
నేను మళ్లీ భారత్‌కు ఆడగలనా లేదా అంటే జవాబివ్వలేను. ప్రస్తుతం ఉండే అనిశ్చితిలో ఏ ప్లేయర్‌కు కూడా అది సాధ్యం కాదు. కానీ ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ క్రికెటర్‌వు అంటూ ప్రతీ రోజు నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను. అదే నన్ను నడిపిస్తుంది’ అని ఈ హైదరాబాదీ తన మనసులో మాటను చెప్పింది.
ఎక్కడైనా ఆట ఒక్కటే...
ఇన్నేళ్ల తర్వాత వచ్చిన అనుభవంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోగలిగే ప్రస్తుతం నాకు వచ్చిందని చెప్పగలను. ఇప్పుడు ఏ టీమ్‌కు ఆడినా సీనియర్లలో ఒకరిగా ఉంటున్నాను. ఇది నాకు ఎంతో మేలు చేస్తోంది.
జూనియర్ అమ్మాయిలకు కొన్ని విషయాలు నేర్పించే క్రమంలో నేను కూడా చాలా నేర్చుకుంటాను. నా నుంచి మరింత మెరుగైన ప్రదర్శన కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడ ఆడుతున్నాను. ఏ జట్టు కోసం ఆడుతున్నాను అనేది పట్టించుకోకుండా దీనిపైనే దృష్టి పెడుతున్నాను’ అని ఆమె స్పష్టం చేసింది.
జట్టు మార్పుతో...
దేశవాళీ క్రికెట్‌లో ఐదేళ్ల పాటు రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రెండేళ్ల క్రితం అరుంధతి రెడ్డి కేరళ జట్టుకు మారింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎన్నో విధాలా ఆలోచించాల్సి వచ్చినా చివరకు ధైర్యం చేసింది. అయితే కేరళకు మారిన తర్వాత అటు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా ఆమె ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను.
అయితే గత రెండేళ్లుగా నా ఆటలో ఎంతో మార్పు వచ్చిందనేది వాస్తవం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. కానీ అవి నాకు మేలు చేశాయి. ఇప్పుడు నా ఆటపై నాకు మరింత స్పష్టత రావడంతో టోర్నీలకు సరైన రీతిలో సిద్ధమవుతున్నా. ఆపై ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు నాలో ఓటమిభయం కూడా తగ్గింది’ అని అరుంధతి వివరించింది.
‘అటాకింగ్’పై దృష్టి...
ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న అరుంధతి... స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోంది. తన బౌలింగ్‌లో పలు మార్పులు చేసుకుంది. ముఖ్యంగా ఆమె బౌలింగ్‌లో ‘అటాకింగ్’ పెరిగింది.
గతంలో బ్యాటర్‌ను ఆడకుండా చేసే లక్ష్యంతో ఆఫ్‌స్టంప్ బయటే వరుసగా బంతులు వేసేది. ఇప్పుడు నేరుగా స్టంప్స్‌పైకే బంతులు గురి పెడుతూ బౌలింగ్ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు ఎదురు దాడి చేసే అవకాశం ఉన్నా...ఈ తరహా బౌలింగే ప్రస్తుతం తన బలంగా మారిందని ఆమె స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment