![T20 World Cup 2024: Mohammed Siraj To Be Honored At Victory Rally In Hyderabad](/styles/webp/s3/article_images/2024/07/5/siraj.jpg.webp?itok=Iuw2qTIU)
టీ20 వరల్డ్‌కప్‌లో విజయానంతరం ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న లోకల్ బాయ్ మొహ్మమద్ సిరాజ్‌కు ఘన స్వాగతం లభించనుంది. సిరాజ్‌ను భారీ ఊరేగింపుతో ఇంటివరకు తీసుకెళ్లాలని అభిమానులు ప్రణాళిక వేశారు. ముంబైలో జరిగిన టీమిండియా విన్నింగ్ పెరేడ్ తరహాలో ఈ ఊరేగింపు కూడా జరగాలని సిరాజ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ విజయోత్సవ ర్యాలీలో భాగ్యనగర వాసులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విక్టరీ ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని సిరాజ్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. సిరాజ్ విక్టరీ ర్యాలీ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మెహిదిపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ఈద్గా మైదానం వరకు సాగనుంది.
కాగా, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్‌కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.
17 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌తో తిరిగి రావడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్‌లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.
విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్‌కప్‌ను చూసేందుకు స్టేడియంకు జనాలు పోటెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment