భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరగాల్సిన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని వారు పేర్కొన్నారు. నగరంలో ఇవాళ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని అంచనా.
నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment