IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి.
కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్‌కు ముందు షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్‌లైన్‌లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్‌లైన్‌లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment