శ్రీలంకపై చారిత్రక విజయంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ నగరానికి వీడ్కోలు పలికింది. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు, రెగ్యులర్ మ్యాచ్‌ల కోసం గత రెండు వారాలుగా నగరంలో బస చేస్తున్న పాక్ జట్టు ఇక్కడి ఆతిథ్యానికి, ఇక్కడి ప్రజల అభిమానానికి, ప్రత్యేకించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్) సిబ్బంది సేవలకు ఫిదా అయ్యింది.
ఓ రకంగా చెప్పాలంటే పాక్ క్రికెటర్లు ఇక్కడి వాతావరణంతో, ఇక్కడి ప్రజలతో మమేకమైపోయారు. వారికి హైదరాబాద్ నగరం స్వదేశానుభూతిని కలిగించింది. ఇక్కడి భాష, ఇక్కడి ఆచార వ్యవహారాలు, తిండి, ప్రత్యేకించి క్రికెట్ అభిమానుల ఆదరణ పాక్ క్రికెటర్లకు హోం టౌన్ ఫీలింగ్ కలిగించాయి.
ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు (వార్మప్ మ్యాచ్‌లతో కలిపి) ఆడిన పాకిస్తాన్.. నిన్నటి మ్యాచ్ అనంతరం హైదరాబాద్‌ను వదిలి అహ్మదాబాద్‌కు పయనమైంది. అక్టోబర్ 14న పాక్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాతో తలపడాల్సి ఉంది.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయానంతరం పాక్ క్రికెటర్లు ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్‌పై తమ ప్రేమను చాటుకున్నారు. గత రెండు వారాలుగా తమ బసను ఆహ్లాదకరంగా మార్చిన మైదాన సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
స్టేడియం సిబ్బంది యొక్క ఎనలేని సేవలను కొనియాడారు. మ్యాచ్ అనంతరం వారితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వారికి తన జెర్సీని బహుకరించి ప్రత్యేకంగా ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
Pakistan players saying "Thank you to the ground staff".
— Johns. (@CricCrazyJohns) October 10, 2023
- A beautiful gesture. pic.twitter.com/xIhwiYHeea
ఇదిలా ఉంటే, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113) సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమరవిక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment