ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్
ప్రధానితో భేటీ మర్చిపోలేని అనుభూతి
సూర్యకుమార్ క్యాచ్ అద్భుతం..
ఇండియా గెలుస్తుందని అప్పుడే అనుకున్నాం
నీలోఫర్ చాయ్ అంటే చాలా ఇష్టం..
ఫస్ట్‌లాన్సర్ ఈద్గా గ్రౌండ్‌లోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నా
‘సాక్షి’తో ప్రపంచకప్ విజేత టీం సభ్యుడు మహ్మద్ సిరాజ్
ప్రధానితో భేటీ మర్చిపోలేని అనుభూతి సూర్యకుమార్ క్యాచ్ అద్భుతం.. ఇండియా గెలుస్తుందని అప్పుడే అనుకున్నాం
నీలోఫర్ చాయ్ అంటే చాలా ఇష్టం.. ఫస్ట్‌లాన్సర్ ఈద్గా గ్రౌండ్‌లోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నా ‘సాక్షి’తో ప్రపంచకప్ విజేత టీం సభ్యుడు మహ్మద్ సిరాజ్
క్రికెట్ పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్ గెలిచిన సంతోషం అంతా ఇంతా కాదు. 17 ఏండ్ల తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేసిన గెలుపు అది. విశ్వవిజేతగా నిలిచి గెలిచిన భారతీయ జట్టు ముంబై వీధుల్లోకి రాగానే జయజయ ధ్వానాలతో.. ఇసుకేస్తే రాలనంత జనం వారికి నీరాజనం పట్టారు. పక్కనే ఉన్న సముద్రం కూడా చిన్నబోయేలా జనసంద్రం వారికి అడుగడుగునా ఘన స్వాగతం పలికింది.
అదే జట్టులో భాగస్వామ్యమైన మన హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్.. ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో స్వాగతం పలికారు. ‘ఇండియా.. ఇండియా.. లవ్ యూ సిరాజ్ భాయ్’అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. అభిమానులు పాట పాడుతుంటే వారితో సిరాజ్ గొంతు కలిపాడు. 140 కోట్ల మంది ఆశల పల్లకి మోస్తూ.. కదనరంగం లాంటి క్రికెట్‌లో నగర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రారాజు.. మియాన్ భాయ్.. మన సిరాజ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
ప్రపంచ కప్ గెలవడం ఎలా అనిపిస్తోంది?
ప్రపంచకప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ప్రపంచకప్ జట్టులో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాకపోతే ఇంత సంతోషంలో నాన్న లేకపోవడం చాలా బాధగా ఉంది. నాన్నను చాలా మిస్ అవుతున్నా.
మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది కదా..? గెలుస్తామని అనుకున్నారా?
ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. సూర్యకుమార్ క్యాచ్ పట్టి డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేయడం ఓ మరపురాని జ్ఞాపకం. భారత జట్టు కప్ గెలుస్తుందని అప్పుడే అనుకున్నాం. చివరకు ప్రపంచకప్ విజేతలుగా నిలిచాం.
హైదరాబాద్ గురించి..
హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. మాసబ్‌ట్యాంకులోని ఫస్ట్ లాన్సర్‌లోనే పెరిగాను. నీలోఫర్ చాయ్ అంటే చాలా ఇష్టం.
ర్యాలీని ఈద్గా వరకు ఎందుకు కొనసాగించారు?
ఫస్ట్ లాన్సర్‌లోని ఈద్గా మైదానం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నా. అందుకే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీని ఈద్గా మైదానం వరకు కొనసాగించాం.
జట్టులో ఇష్టమైన ఆటగాళ్లు ఎవరు?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరూ నన్ను వెన్నంటి ప్రోత్సహించారు. వాళ్లు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన.. మా ఇంటికి వస్తారు. ఫిల్మ్‌నగర్‌లో కొత్త ఇంటి ప్రవేశానికి బెంగళూరు టీమ్ మా ఇంటికి వచ్చింది . అప్పుడు చాలా సంతోషం అనిపించింది. కోహ్లీ మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు.
మోదీతో విందు గురించి..
ప్రపంచకప్ గెలిచి ఇండియా వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయనతో కలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment