Mohammed Siraj Net Worth: New House, Cars, Property Details - Sakshi
Sakshi News home page

Siraj Net Worth: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! అదిరిందయ్యా..

Published Tue, Jun 20 2023 6:15 PM | Last Updated on Tue, Jun 20 2023 7:41 PM

Mohammed Siraj Net Worth House Cars Property Details Check - Sakshi

Mohammed Siraj Net Worth: అద్దె ఇంట్లో.. ఆటో నడుపుతూ తండ్రి సంపాదించిన డబ్బుతో కాలం వెళ్లదీసిన స్థితి నుంచి నుంచి జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లా కొనే స్థాయికి ఎదిగాడు హైదరాబాదీ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా నిలిచిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌.. టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్నాడు.

భారత జట్టులో కీలక బౌలర్‌గా సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాడు. ఆటగాడిగా అద్భుత ప్రదర్శనతో అందరి నీరాజనాలు అందుకుంటున్న సిరాజ్‌.. సంపాదనలోనూ తగ్గేదేలే అంటున్నాడు. మరి ఈ హైదరాబాదీ నెట్‌వర్త్‌, అతడి వద్దనున్న విలాసవంతమైన కార్ల గురించి తెలుసుకుందామా?

2017లో ‘కోటీశ్వరుడిగా’...
దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ చాటుకున్న సిరాజ్‌ను ఐపీఎల్‌ రూపంలో అదృష్టం వరించింది. 2017లో అతడు రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది.

దీంతో సిరాజ్‌ కోటీశ్వరుడియ్యాడు. ఇక ఆ తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సిరాజ్‌ను సొంతం చేసుకోగా.. ఇప్పటికీ అదే జట్టుతో కొనసాగుతున్నాడు. 2017లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌.. నాటి ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రోత్సాహంతో టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

ఇక ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ జట్టులో రెగ్యులర్‌ మెంబర్‌గా మారాడు. ఈ క్రమంలో అతడి సంపాదన కూడా పెరుగుతూ వస్తోంది.

ఏడాదికి మూడు కోట్లు
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో బీ గ్రేడ్‌లో ఉన్న సిరాజ్‌.. ఏడాదికి రూ. 3 కోట్లు ఆర్జిస్తున్నాడు. టీమిండియా తరఫున ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు 3 లక్షల రూపాయల చొప్పున ఫీజుగా అందుకుంటున్నాడు.

ఆర్సీబీ కీలక బౌలర్‌గా..
ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఆర్సీబీ కీలక బౌలర్‌గా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్‌-2023 వేలానికి ముందు రిటైన్‌ చేసుకుంది. ఈ క్రమంలో రూ. 7 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సిరాజ్‌ మియా నెట్‌వర్త్‌ సుమారు 48 కోట్లు ఉంటుందని క్రిక్‌బౌన్సర్‌ అంచనా వేసింది.

కార్లు, బంగ్లా..
అద్దె ఇంట్లో కాలం గడిపిన సిరాజ్‌ తన కుటుంబం కోసం ఇటీవలే ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌ నగర్‌ ఏరియాలో ఖరీదైన ఇంటిని కొన్నాడు. ఐపీఎల్‌-2023 జరుగుతున్న సమయంలోనే గృహప్రవేశం చేయగా.. ఆర్సీబీ ఆటగాళ్లందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు సిరాజ్‌.

సిరాజ్‌ గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ సెడాన్‌తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహేంద్ర బహుమతిగా అందించిన మహేంద్ర థార్‌ కూడా ఉంది. కాగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తర్వాత తనకు వచ్చిన మొత్తంతో సిరాజ్‌ తొలుత టయోటా కరోలాను కొనుగోలు చేశాడు. ఇలా ఆటో డ్రైవర్‌ కొడుకు స్థాయి నుంచి ఖరీదైన కార్లు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిన సిరాజ్‌ యువతకు ఆదర్శనీయమే కదా!!

కాగా సిరాజ్‌ ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్‌లో ఆడాడు. ఇంగ్లండ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

చదవండి: రోహిత్‌ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
శుబ్‌మన్‌ గిల్‌ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా! 
టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌.. ! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement