
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఈ నలుగురిలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. పైగా నలుగురు 27 ఏళ్ల లోపు వారే. ఈ నలుగురు 45 బంతుల్లోపే సెంచరీలు పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు సన్‌రైజర్స్ ఆటగాళ్లు కాగా.. ఒకరు పంజాబ్, ఒకరు రాజస్థాన్ ఆటగాడు.
ఈ సీజన్‌లో తొలి సెంచరీని సన్‌రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ చేశాడు. సీజన్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఇషాన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో ఇషాన్ చేసిన ఈ సెంచరీ 15వ వేగవంతమైన సెంచరీ.
ఈ సీజన్‌లో రెండో సెంచరీని పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య చేశాడు. సీజన్ 22వ మ్యాచ్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్ మూడంకెల స్కోర్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.
ప్రియాంశ్ ఈ సెంచరీని కేవలం 39 బంతుల్లో పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో ఇది ఆరో వేగవంతమైన సెంచరీ. ప్రియాంశ్ ఈ రికార్డును సన్‌రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్‌తో షేర్ చేసుకున్నాడు. ట్రవిస్ కూడా గత సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో శతక్కొట్టాడు.
ఈ సీజన్‌లో మూడో సెంచరీని సన్‌రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ చేశాడు. సీజన్ 27వ మ్యాచ్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 141 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అభిషేక్‌ది ఏడో వేగవంతమైన సెంచరీ.
ఈ సీజన్‌లో నాలుగో సెంచరీని రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చేశాడు. సీజన్ 47వ మ్యాచ్‌లో వైభవ్ గుజరాత్ టైటాన్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్‌లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతుల్లో) పేరిట ఉంది.
వైభవ్ ఈ సెంచరీ చేసే సమయానికి అతని వయసు కేవలం 14 ఏళ్ల 32 రోజులు. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో సెంచరీలు చేసిన నలుగురిలో వైభవ్ అత్యంత పిన్న వయస్కుడు.