సాక్షి, హైదరాబాద్: ‘‘నాన్న లేని లోటు తీర్చలేనిది. నేను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన శ్రమ దాగి ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై వికెట్ తీసుకున్న ప్రతిసారీ నాన్నే గుర్తొచ్చారు. అక్కడి ప్రదర్శన ఆయనకే అంకితం’’ అంటూ టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. అదే విధంగా.. క్లిష్ట పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆసీస్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ హైదరబాదీ.. టూర్ ముగించుకుని నేడు నగరానికి తిరిగి వచ్చాడు. విమానాశ్రయం నుంచి నేరుగా తండ్రి మహ్మద్ గౌస్ సమాధిని సందర్శించిన సిరాజ్.. ఆయనకు నివాళులు అర్పించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ విజయం వెలకట్టలేనిదంటూ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.(చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్)
కోహ్లి భాయ్ ప్రోత్సహించాడు
‘‘కష్ట సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నన్ను రీటేన్ చేసుకుంది. కోహ్లి భాయ్ నాకు అడుగడుగునా అండగా నిలిచాడు. ఒత్తిడి వీడి ఆటపై దృష్టి సారించాలని చెప్పాడు. నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఐపీఎల్ ద్వారా మంచి అనుభవం లభించింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే సంప్రదాయ క్రికెట్ ఆడటం భిన్నమైంది. ఆసీస్ పర్యటనతో సంతోషంగా ఉన్నా. నాన్న కలను నెరవేర్చాలని పట్టుదలగా ఆడాను. టీమిండియాకు ఆడుతున్నా అనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకున్నా’’ అంటూ టెస్టుల్లో అరంగేట్రానికి ముందు తను ఎదుర్కొన్న అనుభవాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ బదులిచ్చాడు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!)
ఫేవరెట్ వికెట్ అతడిదే..
ఇక ఆసీస్ టూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు లేకపోయినా ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. బుమ్రా నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. నాలుగో టెస్టులో తొలుత కాస్త ఆందోళనకు గురయ్యాను. కానీ తను సపోర్టు చేశాడు. నా ప్రదర్శనను ప్రశంసిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇక అజ్జూ భాయ్(అజింక్య రహానే) యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాడు. నటరాజన్, సైనీ, వాషింగ్టన్ సుందర్, నన్ను ఇలా అందరినీ ప్రోత్సహించాడు. కోహ్లి భాయ్ కెప్టెన్సీని ఎంతగా ఎంజాయ్ చేశానో.. అజ్జూ భాయ్ సారథ్యాన్ని కూడా అంతే ఆస్వాదించాను. ఇక నా ఫేవరెట్ వికెట్ గురించి చెప్పాలంటే.. మార్నస్ లబుషేన్‌దే. కీలక సమయంలో తీసిన ఆ వికెట్ నాకెంతో ప్రత్యేకం’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. (చదవండి: కీలక వికెట్లు కూల్చిన సిరాజ్.. బుమ్రా ఆలింగనం)
ఇప్పుడే ఇంటికి వచ్చాను
అదే విధంగా.. ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్‌కు ఎలా సన్నద్ధమవుతారు అని ప్రశ్నించగా.. ‘‘ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటి భోజనం చేశా. అలా అని రిలాక్స్ అవ్వను. షమీ, ఉమేశ్ వచ్చిన తర్వాత కూడా మార్పు ఉండకపోవచ్చు. నిజానికి మేనేజ్‌మెంట్ ఎలా చెప్తే అదే నేను చేస్తాను. నేను ఇప్పుడు కూడా జూనియర్‌నే. అయితే ఆసీస్ విజయం ఇచ్చిన విశ్వాసంతో ముందుకు సాగుతాను. మనసు పెట్టి ఆడతాను అంతే. కఠినశ్రమతో పాటు ఆటను గౌరవించడం నేర్చుకున్నా. నా కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇక ముందు కూడా ఇలాగే మీ మద్దతు నాకు కావాలి’’ అని ఫ్యాన్స్‌కు సిరాజ్ విజ్ఞప్తి చేశాడు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలని ఈ హైదరాబాదీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా టెస్టు సిరీస్‌లో సిరాజ్ మొత్తంగా 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. ముఖ్యంగా గబ్బాలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. టూర్‌లో ఉండగానే తండ్రి మరణం, ఆసీస్ ప్రేక్షకుల జాత్యహంకార వ్యాఖ్యలు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఒత్తిడి జయించి తన ప్రతిభ నిరూపించుకుని దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment