సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!.. నీకు ఎందుకంత దూకుడు? | Almost Broke My Finger Siraj Act Leaves Jadeja Fuming Hurling Mouthful | Sakshi
Sakshi News home page

‘నా వేలు విరగ్గొట్టేశావు పో’.. సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!

Published Sun, Dec 15 2024 5:12 PM | Last Updated on Sun, Dec 15 2024 5:32 PM

Almost Broke My Finger Siraj Act Leaves Jadeja Fuming Hurling Mouthful

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు బ్రిస్బేన్‌లో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టు సందర్భంగా ఈ హైదరాబాదీ బౌలర్‌ను ఆస్ట్రేలియా అభిమానులు పరుష పదజాలం వాడుతూ హేళన చేశారు. అడిలైడ్‌ పింక్‌బాల్‌ టెస్టులో ట్రవిస్‌ హెడ్‌కు సిరాజ్‌ సెండాఫ్‌ ఇచ్చిన తీరును విమర్శిస్తూ.. అవమానించేలా గట్టిగా అరిచారు.

ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య శనివారం గబ్బా మైదానంలో మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా సిరాజ్‌ను కించపరిచేలా ఆసీస్‌ ఫ్యాన్స్‌ ప్రవర్తించారు. తాజాగా ఆదివారం నాటి రెండో రోజు ఆటలోనూ సిరాజ్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ స్పీడ్‌స్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!
కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరుగుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో భారత్‌, అడిలైడ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి.

ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల శనివారం నాటి తొలిరోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆసీస్‌.. 13.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

బుమ్రాకు ఐదు
ఈ క్రమంలో ఆదివారం రెండో రోజు ఆట మాత్రం సజావుగా సాగింది. ట్రవిస్‌ హెడ్‌ భారీ శతకం(152), స్టీవ్‌ స్మిత్‌(101) సెంచరీ కారణంగా ఆసీస్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లు నష్టపోయి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. సిరాజ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

జడ్డూ కోపానికి కారణం అదే
ఇక మూడో టెస్టుతో భారత తుదిజట్టులోకి వచ్చిన స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. ఆదివారం బంతితో బరిలో దిగాడు. పదహారు ఓవర్ల పాటు బౌల్‌ చేసి 76 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, వికెట్‌ మాత్రం తీయలేకపోయాడు. అయితే, లంచ్‌ తర్వాత తాను బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఫీల్డర్‌ సిరాజ్‌ వ్యవహరించిన తీరు జడ్డూ కోపం తెప్పించింది.

జడేజా బౌలింగ్‌లో ట్రవిస్‌ హెడ్‌ ఆఫ్‌సైడ్‌ దిశగా బంతిని తరలించి.. సింగిల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో బాల్‌ను అందుకున్న సిరాజ్‌ కాస్త నిర్లక్ష్య రీతిలో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు బంతిని విసిరినట్లు కనిపించింది. హెడ్‌ తలమీదుగా వచ్చిన ఆ బంతిని అందుకునే క్రమంలో జడ్డూ చేతి వేళ్లకు బలంగా తగిలింది.

దీంతో జడేజా కోపంతో సిరాజ్‌ వైపు చూస్తూ ఏదో అన్నట్లుగా కనిపించింది. అంత దూకుడు అవసరమా అన్నట్లు అసహనం ప్రదర్శించాడు. ఇందుకు చిన్నబుచ్చుకున్న సిరాజ్‌.. సారీ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

నా వేలును విరగ్గొట్టేశావు పో..
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌, ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మార్క్‌ నికోలస్‌ స్పందిస్తూ.. సిరాజ్‌ అత్యుత్సాహం జడేజాతో మాటల యుద్ధానికి దారి తీసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిజానికి జడ్డూ చేసింది సరైందేనని.. ‘‘నా వేలును విరగ్గొట్టేశావు పో.. ఏంటిది ఫ్రెండ్‌.. కాస్త సంయమనం పాటించు’’ అన్నట్లుగా అతడు లుక్‌ ఇచ్చాడని నికోలస్‌ పేర్కొన్నాడు.

చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్‌ హెడ్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement