ఆసీస్‌తో మూడో టెస్టు.. సిరాజ్‌కు చేదు అనుభవం | IND Vs AUS 3rd Test: Mohammed Siraj Booed At The Gabba As Fans Still Salty About Head Spat, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs AUS 3rd Test: బ్రిస్బేన్‌ టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌కు చేదు అనుభవం

Published Sat, Dec 14 2024 9:37 AM | Last Updated on Sat, Dec 14 2024 10:29 AM

Ind vs Aus: Siraj Booed At the Gabba As fans Still Salty about Head Spat

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా జట్టు అభిమానులు ఈ హైదరాబాదీ బౌలర్‌పై అక్కసు వెళ్లగక్కారు. సిరాజ్‌ను ఉద్దేశించి పరుష పదజాలం వాడుతూ, గట్టిగా అరుస్తూ అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించారు. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఈ ఘటన జరిగింది.

 బ్రిస్బేన్‌ వేదికగా
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో విజయం సాధించిన భారత్‌.. అడిలైడ్‌లో జరిగిన పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఇరుజట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా  ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది.

సిరాజ్‌ను టీజ్‌ చేసిన ఆసీస్‌ఫ్యాన్స్‌.. కారణం ఇదే
గబ్బా మైదానంలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా భారత బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించగా.. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌ను సిరాజ్‌ వేశాడు. అయితే, అతడు బంతి పట్టుకుని రంగంలోకి దిగగానే.. ఆస్ట్రేలియా అభిమానులు గట్టిగా అరుస్తూ అతడిని విమర్శించారు. గత మ్యాచ్‌లో సిరాజ్‌.. ఆసీస్‌ స్టార్‌ ట్రవిస్‌ హెడ్‌తో వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.

ఇద్దరికీ షాకిచ్చిన ఐసీసీ
అడిలైడ్‌ టెస్టులో హెడ్‌ భారీ శతకం(141 బంతుల్లో 140)తో ఆకట్టుకున్నాడు. అతడిని అవుట్‌ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి రాగా.. ఎట్టకేలకు సిరాజ్‌ అద్భుత యార్కర్‌తో అతడికి చెక్‌ పెట్టాడు.  అయితే, తన బౌలింగ్‌లో ట్రవిస్‌ హెడ్‌ బౌల్డ్‌ కాగానే.. ‘ఇక వెళ్లిపో’ అన్నట్లుగా రియాక్షన్స్‌ ఇస్తూ సిరాజ్‌ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన హెడ్‌ సైతం గట్టిగానే అతడికి బదులిచ్చాడు.

ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) వీళ్లిద్దరికీ గట్టి షాక్‌ ఇచ్చింది. పరస్పరం దూషించుకున్న ఈ ఇద్దరు స్టార్ల మ్యాచ్‌ ఫీజులో 20 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. చెరో డీమెరిట్‌ పాయింట్‌ కూడా జతచేసింది. గత రెండేళ్లలో ఇద్దరిదీ తొలి తప్పిదం కాబట్టి ఈమాత్రం శిక్షతో సరిపెట్టింది. లేదంటే ఇద్దరూ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చేది.

వర్షం వల్ల అంతరాయం
ఇక సిరాజ్‌- హెడ్‌ గొడవపై క్రికెట్‌ పండితులు విమర్శలు గుప్పించగా.. ఆసీస్‌ ఫ్యాన్స్‌ మాత్రం మూడో టెస్టు సందర్భంగా సిరాజ్‌ను హేళన చేస్తున్నట్లుగా కామెంట్లు చేశారు. కాగా బ్రిస్బేన్‌ టెస్టుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వరణుడి వల్ల తొలుత టాస్‌ ఆలస్యమైంది. ఆ తర్వాత మ్యాచ్‌ మొదలైనా.. 13.2 ఓవర్ల ఆట ముగిసే సరికి మళ్లీ వాన కురిసింది. ఈ నేపథ్యంలో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి ఆస్ట్రేలియా ఒక్క వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు సాధించింది.

చదవండి: అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్‌కు ఇచ్చిపడేసిన గిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement