సిరాజ్‌ టెన్షన్‌ పెట్టాడు.. కానీ అతడి వల్లే.: నితీశ్‌ రెడ్డి తండ్రి కామెంట్స్‌ వైరల్‌ | Thankfully Siraj Managed: Nitish Reddy Father Reacts to Son Maiden Ton | Sakshi
Sakshi News home page

సిరాజ్‌ టెన్షన్‌ పెట్టాడు.. కానీ అతడి వల్లే.: నితీశ్‌ రెడ్డి తండ్రి కామెంట్స్‌ వైరల్‌

Published Sat, Dec 28 2024 3:43 PM | Last Updated on Sat, Dec 28 2024 4:20 PM

Thankfully Siraj Managed: Nitish Reddy Father Reacts to Son Maiden Ton

నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy) మెల్‌బోర్న్‌లో సాధించిన ఘనత తమ జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అతడి తండ్రి ముత్యాలరెడ్డి అన్నారు. ఇదొక ప్రత్యేకమైన అనుభూతి అని.. తన కుమారుడి కష్టానికి ప్రతిఫలం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా టీమిండియా తరఫున టీ20ల ద్వారా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు నితీశ్‌ రెడ్డి.

పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన 21 ఏళ్ల ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)కి ఎంపికయ్యాడు. కంగారూ దేశంలోని పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసిన తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. తొలి టెస్టు నుంచే బ్యాట్‌తో చెలరేగిన నితీశ్‌ రెడ్డి.. తాజాగా మెల్‌బోర్న్‌ వేదికగా శతకంతో మెరిశాడు.

97 పరుగుల వద్ద ఉండగా ఎనిమిదో వికెట్‌
బాక్సింగ్‌ డే టెస్టులో భాగంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆసీస్‌ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... భారత్‌ తరఫున తొలి సెంచరీ సాధించాడు. అయితే, నితీశ్‌ రెడ్డి 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. వాషింగ్టన్‌ సుందర్‌(50) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు.

99.. తొమ్మిదో వికెట్‌ డౌన్‌
ఈ క్రమంలో జస్‌ప్రీత్‌ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అయితే, అతడు పరుగుల ఖాతా తెరవకముందే కమిన్స్‌ బుమ్రాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోగా.. అప్పటికి నితీశ్‌ 99 పరుగుల వద్ద ఉన్నాడు. దీంతో బుమ్రా స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ వికెట్‌ కాపాడుకుంటాడా?.. నితీశ్‌ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకోగలడా? అనే ఉత్కంఠ పెరిగింది.

ఫోర్‌ బాది వంద పరుగుల మార్కుకు
అయితే, సిరాజ్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో మూడు బంతులను చక్కగా డిఫెన్స్‌ చేసుకోవడంతో.. నితీశ్‌ రెడ్డికి లైన్‌క్లియర్‌ అయింది. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో అతడు ఫోర్‌ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

 

ఇక నితీశ్‌ రెడ్డి శతకం బాదినపుడు అతడి కుటుంబం కూడా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్‌ తండ్రి ముత్యాలరెడ్డి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ ముత్యాలరెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు.

సిరాజ్‌ వల్లే సాధ్యమైంది
ఈ సందర్భంగా ముత్యాలరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబానికి ఇదెంతో ప్రత్యేకమైన రోజు. జీవితాంతం ఈ క్షణాలు గుర్తుండిపోతాయి. 14- 15 ఏళ్ల వయసు నుంచే నితీశ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఇప్పుడిక అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటుతుండటం సంతోషం. ఈ భావనను మాటల్లో వర్ణించలేను. నిజానికి నితీశ్‌ 99 పరుగుల వద్ద ఉన్నపుడు నాకు టెన్షన్‌గా అనిపించింది. అప్పటికి ఒకే వికెట్‌ చేతిలో ఉన్నా.. సిరాజ్‌ అద్భుతం చేశాడు. అతడు వికెట్‌ కాపాడుకున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్‌ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement