మెల్‌బోర్న్ టెస్ట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి చేసిన సూపర్ సెంచరీకి యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతుంది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి భారత క్రికెట్ దిగ్గజాలు నితీశ్ సూపర్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు. నితీశ్ సెంచరీ చూసి రవిశాస్త్రి కన్నీటిపర్యంతం కాగా.. గవాస్కర్ జేజేలు పలికాడు.
సాధారణంగా గవాస్కర్ ఏ ఆటగాడిని పెద్దగా పొగడడు. అలాంటిది సన్నీ నితీశ్‌ను పొగడటం చూస్తుంటే ఆశ్చర్యమేసింది. పొగడటమే కాదు.. నితీశ్ సెంచరీ అనంతరం గవాస్కర్ స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చాడు. భారత క్రికెట్ చరిత్రలో నితీశ్ సెంచరీ చిరకాలం గుర్తుండిపోతుందని కితాబిచ్చాడు.
గవాస్కర్.. నితీశ్‌ను ప్రశంశిస్తూనే ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసుంటారు. వాటిని నితీశ్ ఎప్పటికీ గుర్తించుకోవాలని సూచించారు. మూడో రోజు ఆట ముగిశాక నితీశ్ కుటుంబ సభ్యులు గవాస్కర్‌ను కలిశారు.
Nitish Kumar Reddy's father touching Sunil Gavaskar's feet. (ABC Sport). pic.twitter.com/sVSep2kl9G
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2024
ఈ సందర్భంగా నితీశ్ తల్లి, తండ్రి, సోదరి గవాస్కర్‌కు పాదాభివందనం చేశారు. నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కాళ్లకు నమస్కారం చేస్తుండగా గవాస్కర్ వారించారు. అయినా ముత్యాల రెడ్డి వినలేదు. సార్.. మీరు గొప్ప క్రికెటర్ అంటూ సాష్టాంగపడ్డాడు. అనంతరం గవాస్కర్ ముత్యాల రెడ్డిని హత్తుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 266 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కమిన్స్ (34), లయోన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment