Nitish Kumar Reddy: హాఫ్‌ సెంచరీ తర్వాత పుష్ప.. సెంచరీ తర్వాత బాహుబలి | IND VS AUS 4th Test: Nitish Kumar Reddy Made All Telugu People Proud With His Fabulous Century | Sakshi
Sakshi News home page

Nitish Kumar Reddy: హాఫ్‌ సెంచరీ తర్వాత పుష్ప.. సెంచరీ తర్వాత బాహుబలి

Published Sat, Dec 28 2024 12:56 PM | Last Updated on Sat, Dec 28 2024 1:04 PM

IND VS AUS 4th Test: Nitish Kumar Reddy Made All Telugu People Proud With His Fabulous Century

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో అద్భుతమైన శతకంతో మెరిసిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ గర్వపడేలా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందిన నితీశ్‌ 21 ఏళ్ల 214 రోజుల వయసులోనే ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించాడు. 

తద్వారా ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించిన మూడో అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్‌ దిగ్గజం​ సచిన్‌ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించగా.. రిషబ్‌ పంత్‌ 21 ఏళ్ల, 91 రోజుల వయసులో ఆస్ట్రేలియాలో శతకొట్టాడు.

సరికొత్త ధృవ తార
భారత క్రికెట్‌లో సరికొత్త ధృవ తార అవతరించింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి రూపంలో టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికాడు. మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో జట్టు కష్టాల్లో (191/6) ఉన్నప్పుడు బరిలోకి దిగిన నితీశ్‌.. సహచరుడు వాషింగ్టన్‌ సుందర్‌ను సమన్వయపరుచుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. బాక్సింగ్‌ డే టెస్ట్‌లో నితీశ్‌ చేసిన సెంచరీ ఆషామాషీ సెంచరీ కాదు. భారత క్రికెట్‌ బ్రతికి ఉన్నంతవరకు ఈ సెంచరీ ప్రతి క్రికెట్‌ అభిమానికి గుర్తుంటుంది.

డెబ్యూ సిరీస్‌లోనే సత్తా చాటిన నితీశ్‌
అరంగేట్రం సిరీస్‌లోనే సూపర్‌ సెంచరీతో మెరిసిన నితీశ్‌ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల మన్ననలందుకుంటున్నాడు. నితీశ్‌ ఆగమనంతో భారత క్రికెట్‌ సరికొత్త ధృవ తార అవతరించిందని క్రికెట్‌ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సునీల్‌ గవాస్కర్‌ లాంటి దిగ్గజం నితీశ్‌ సెంచరీని అద్వితీయమైనదిగా అభివర్ణించాడు. ఆసీస్‌ సిరీస్‌లో నితీశ్‌ ఆది నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో నితీశ్‌ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు.

ఆసీస్‌ గడ్డపై సరికొత్త చరిత్ర
నితీశ్‌.. ఈ సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో నితీశ్‌ ఆసీస్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

హాఫ్‌ సెంచరీ తర్వాత పుష్ప.. సెంచరీ తర్వాత బాహుబలి
హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం పుష్ప స్టయిల్‌లో తగ్గేదేలేదంటూ సెలబ్రేషన్స్‌ చేసుకున్న నితీశ్‌.. సెంచరీ అనంతరం బాహుబలిలో ప్రభాస్‌లా విన్నూత్నంగా సంబురం చేసుకున్నాడు.

ప్రౌడ్‌ ఫాదర్‌
నితీశ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం మ్యాచ్‌ను ‍ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అతని తండ్రి చాలా ఎమోషనల్‌ అయ్యాడు. పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఆనందబాష్పాలు కార్చాడు. ఆట ముగిసిన అనంతరం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ నితీశ్‌ తండ్రితో మాట్లాడాడు. తమ జీవితాల్లో ఇవి మరిచిపోలేని క్షణాలని నితీశ్‌ తండ్రి తెలిపాడు. నితీశ్‌ విరాట్‌ను అమితంగా ఆరాధిస్తాడని నితీశ్‌ తండ్రి ఈ సందర్భంగా చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement