టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.
బంగ్లాతో సిరీస్ సందర్భంగా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి.
అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.
మెల్‌బోర్న్‌లో గుర్తుండిపోయే శతకం
ఇక మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.
కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.
ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.
నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.
ఐదో బౌలర్‌గానూ
అదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.
చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ
Comments
Please login to add a commentAdd a comment