మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే మెల్‌బోర్న్ చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో శనివారం ప్రాక్టీస్ అనంతరం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.
మెల్‌బోర్న్ టెస్టులో భారత టాపార్డర్‌నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నట్లు జడేజా అన్నాడు. ఆరంభంలో పరుగులు రాకపోతే ఆ తర్వాత ఒత్తిడి పెరిగిపోతుందని అతను అభిప్రాయ పడ్డాడు.
‘ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలాంటి చోట టాపార్డర్ పరుగులు కీలకంగా మారతాయి. వారు పరుగులు చేయకపోతే లోయర్ ఆర్డర్‌పై చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ టెస్టులో అలా జరగదని ఆశిస్తున్నా. జట్టుగా చూస్తే బ్యాటింగ్‌లో అందరూ రాణిస్తేనే భారీ స్కోరుకు అవకాశం ఉన్నా టాపార్డర్, మిడిలార్డర్ పరుగులు ప్రధానం’ అని జడేజా వ్యాఖ్యానించాడు.
గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జడేజా... ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన దగ్గరినుంచి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూ సాధన చేసినట్లు వెల్లడించాడు.
‘మూడు టెస్టుల తర్వాత 1–1తో సమంగా ముందుకు వెళ్లడం మంచి స్థితిగా భావిస్తున్నా. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతాయి. మేం ఒకటి గెలిచినా చాలు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటాం. ఇందులో సత్తా చాటితే చివరి టెస్టు గురించి ఆలోచన లేకుండా ఫలితం సాధించవచ్చు. గత పర్యాయాలు ఇక్కడ భారత్ సిరీస్ గెలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశాము" అని జడ్డూ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment