
బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో స్థానం
చోటు కోల్పోయిన మేఘన, అంజలి
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ (2024–25)ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తం 16 మంది ప్లేయర్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లుగా విభజించి బోర్డు కాంట్రాక్ట్‌లు అందించింది. గత సీజన్‌లో ఈ జాబితాలో 17 మంది ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 16కు తగ్గింది. 2022 అక్టోబర్ తర్వాత భారత జట్టుకు ఆడని ఆంధ్ర ఓపెనింగ్ బ్యాటర్ సబ్బినేని మేఘన, 2023 జనవరి తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించని ఆంధ్ర లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అంజలి శర్వాణిలకు కొత్త కాంట్రాక్ట్ జాబితాలో స్థానం లభించలేదు.
హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి తొలిసారి ఈ అవకాశం దక్కింది. అరుంధతి భారత్ తరఫున 5 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఆరుగురు ప్లేయర్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించి ఐదుగురిని కొత్తగా ఎంపిక చేశారు. అనూహ్యాలేమీ లేకుండా టాప్ ప్లేయర్లు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు ‘ఎ’ గ్రేడ్‌లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయినా... షఫాలీ వర్మ తన ‘బి’ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోవడం విశేషం. హెడ్ కోచ్ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీ చైర్మన్ నీతూ డేవిడ్ సిఫారసు ప్రకారం బోర్డు ఈ కాంట్రాక్ట్‌లను అందించింది.
భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా
గ్రేడ్ ‘ఎ’ (ఏడాదికి రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ.
గ్రేడ్ ‘బి’ (ఏడాదికి రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ.
గ్రేడ్ ‘సి’ (ఏడాదికి రూ. 10 లక్షలు): యస్తిక భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్.
Comments
Please login to add a commentAdd a comment