
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే.
రోహిత్, కోహ్లిల కొనసాగింపు!
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్‌లోనే కొనసాగించనున్నారు.
అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్‌కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.
అంతేకాదు.. టాప్ గ్రేడ్‌లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్‌గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.
టాప్ క్లాస్‌లో అతడి పేరు
ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్‌లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.
తొలిసారి వీళ్లకు చోటు
ఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.
ఇక బీసీసీఐ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.
గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితా
గ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా
గ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్
గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్.