
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ లభించనుందని తెలుస్తుంది. శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ గతేడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్దరించలేదు. గత మార్చిలో శ్రేయస్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.
శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేజార్చుకున్నాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. రీఎంట్రీలో శ్రేయస్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు ఆడి 79.92 స్ట్రయిక్‌రేట్‌తో 195 పరుగులు చేశాడు. శ్రేయస్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ఫైనల్‌కు చేరింది.
ఈ టోర్నీలో శ్రేయస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొదటి బ్యాటింగ్‌తో పాటు ఛేదనలోనూ సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన (17 బంతుల్లో 15) శ్రేయస్.. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (67 బంతుల్లో 56) మెరిశాడు. చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మరో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ (45) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.
ఈ ప్రదర్శనల తర్వాత శ్రేయస్‌కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది. దీంతో బీసీసీఐ శ్రేయస్‌కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది. బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి కొత్తగా వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్ తుది సమరానికి అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 9వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ (2019-2021) తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment