కౌర్ ఇంట సంబరాల వెల్లువ
మోగా: మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సంచల ఇన్నింగ్స్‌తో భారత జట్టును గెలిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. కౌర్ ధనాధన్ ఆటతో ఇండియా టీమ్ ఫైనల్లోకి దూసుకెళడంతో పంజాబ్‌లోని మోగాలో కౌర్ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పరస్పరం స్వీట్లు పంచుకుని సంతోషం వెలిబుచ్చారు. ఫైనల్లో విజయం సాధించి టైటిల్ గెలవాలని ఆకాంక్షించారు.
తుదిపోరులోనూ హర్మన్‌ప్రీత్ రాణించాలని ఆమె తండ్రి హర్మీందర్ సింగ్ భుల్లర్ కోరుకున్నారు. భారత్ ప్రపంచకప్ గెలవాలని, జాతి గర్వించాలని ఆయన పేర్కొన్నారు. ఆడపిల్లలు సాధికారత సాధించేలా ప్రోత్సహించాలని హర్మన్‌ప్రీత్ అన్నారు. ‘ఆడపిల్లలను కడుపులోనే చంపడం మానుకోవాలి. దేశం గర్వించేలా నా కూతురు ఆడింది. మిగతా ఆడపిల్లలను కూడా ఇదే విధంగా ప్రోత్సహించాల’ని ఆమె పేర్కొన్నారు.
హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదని మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అన్నారు. పురుషుల క్రికెట్‌లోనూ ఇలాంటి ఇన్నింగ్స్ అరుదుగా చూస్తుంటామని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కౌర్ 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కౌర్ సంచలన ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.