
ఒత్తిడిని అధిగమిస్తేనే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో విజయం వరిస్తుందని భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ పేర్కొంది. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లపై పైచేయి సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని మహిళా జట్టుకు సూచించింది.
ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలు
కాగా నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా... 2023 ఫిబ్రవరిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ భారత మహిళా జట్టు ప్రయాణం సెమీఫైనల్స్‌నే ముగిసింది. ఈ దఫా కూడా మన జట్టు ఆస్ట్రేలియా చేతిలోనే ఓడటం గమనార్హం.
అయితే ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదలరాదని, మన ప్లేయర్లు ఒత్తిడిని అధిగమించాలని భారత మాజీ ప్లేయర్ డయానా ఎడుల్జీ సూచించింది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది.
మనదైన రోజు ఏదైనా సాధ్యమే
ఈ సందర్భంగా... ఎడుల్జీ మాట్లాడుతూ... ‘ఆస్ట్రేలియాలాంటి ప్రొఫెషనల్ టీమ్‌ను ఓడించాలంటే మనం అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలి. మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే ప్రత్యర్థి కూడా తడబడుతుంది. అయితే టీ20ల్లో మనదైన రోజు ఏదైనా సాధ్యమే. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో మనం ఓడిపోతామని అనుకున్నామా? ప్లేయర్లు ఎలాంటి స్థితిలోనూ ఒత్తిడికి తలవంచవద్దు.
భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి
ప్రపంచకప్ కప్ టోర్నీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఆమెకు ఉంది. ఆమె బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీకి కూడా ఈ టోర్నీ సవాల్’ అని ఎడుల్జీ అభిప్రాయపడింది. అదే విధంగా.. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీమ్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ఒకే ఏడాది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
చదవండి: DT 2024: గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?(వీడియో)
Comments
Please login to add a commentAdd a comment