మెగా టోర్నీ కోసం యూఏఈ బయలుదేరిన టీమిండియా
ముంబై: గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని... ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు మంగళవారం బయలు దేరింది.
గత జూలైలో ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచాక మరే టోర్నీలో ఆడని టీమిండియా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టి20 ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు... రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
వరల్డ్‌కప్‌లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ పాల్గొంది.
అడ్డంకులు అధిగమిస్తాం...
‘అత్యుత్తమ జట్టుతో ప్రపంచకప్ ఆడనున్నాం. జట్టులోని ప్లేయర్లందరూ చాలా కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడాం. ఈసారి అడ్డంకులన్ని అధిగమించి విజేతగా నిలవాలని అనుకుంటున్నాం. శిక్షణ సమయంలో బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాం. అన్ని రంగాల్లో రాటుదేలాం. ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం.
కానీ మాది కాని రోజు ఒకటి ఎదురైంది. దీంతో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. నేను ఇప్పటి వరకు చాలా ప్రపంచకప్‌లు ఆడాను. అయినా మొదటి సారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తోంది. ఉత్సాహంలో ఏమాత్రం తేడా లేదు. మేము ఏ జట్టునైనా ఓడించగలం.
ఆ్రస్టేలియాకు కూడా తెలుసు... ప్రపంచంలో వారిని ఓడించే జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే’ అని హర్మన్ వివరించింది. 2009 నుంచి ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు జరిగిన 8 మెగా టోర్నీల్లోనూ 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను నియమించాం: మజుందార్
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం అనంతరం జట్టుకు ఎలాంటి శిక్షణ అవసరమో ఆలోచించి దాన్నే ప్రత్యేక శిబిరం ద్వారా అందించామని మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ‘జట్టుకు ముందు ఫీల్డింగ్, ఫిట్‌నెస్ శిక్షణ అందించాం. ఆ తర్వాత పది రోజుల పాటు నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రేను నియమించాం.
ప్లేయర్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫీల్డింగ్‌ను మెరుగు పరచడంపై మరింత దృష్టి సారించాం. శిబిరంలో భాగంగా యోగా సెషన్‌లు, మానసిక దృఢత్వానికి సంబంధించిన శిక్షణ అందించాం. అన్నీటికి సిద్దంగా ఉండే విధంగా ప్లేయర్లకు తర్ఫీదునిచ్చాం. వరల్డ్‌కప్‌లో భాగంగా పది రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్ని విభాగాలను సరిచూసుకున్నాం. టాపార్డర్‌లో ఆరుగురు మంచి బ్యాటర్లు ఉన్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అయినా... అందరి లక్ష్యం జట్టును గెలిపించడమే. వన్‌డౌన్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాం. యూఏఈలో పరిస్థితులు భారత్‌ను పోలే ఉంటాయి. ఆరంభంలో అధిక బౌన్స్ ఉండే అవకాశం ఉంది’ అని మజుందార్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం మహిళల టి20 ప్రపంచ కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment