నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తొలి వన్డే
ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గని టీమిండియా
ఉదయం గం. 8:50 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌లు నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియాలో మాత్రం ఇప్పటి వరకు నిరాశే మిగిలింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.
ఈ నేపథ్యంలో అందని ద్రాక్షగా ఉన్న ఆ్రస్టేలియాలో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మరో అవకాశం లభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య ఈరోజు తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ సన్నాహాలు ఈ సిరీస్ నుంచే భారత్ మొదలుపెట్టనుంది.
బ్రిస్బేన్: ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుండగా... మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ జట్టు ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది.
భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో జట్టు బలంగానే ఉన్నా... వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది.
ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య 16 వన్డేలు జరగగా... అందులో భారత జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. 2021లో చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన మన జట్టు 1–2తో సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే భారత జట్టు శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. 2025లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నా
మరోవైపు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో తహిలా మెక్‌గ్రాత్ జట్టుకు సారథ్యం వహించనుంది. ‘భారత జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వారిపై పైచేయి సాధించడం అంత సులువు కాదు. స్వదేశంలో ఆడుతుండటంతో మాపై అంచనాలు ఎక్కువ ఉంటాయి. నేను పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నా. ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తా’ అని తహిలా పేర్కొంది.
రాధ యాదవ్‌పై భారీ అంచనాలు
ఇటీవల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చడంతో హర్మన్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే వాదనలు ఎక్కువైనా... మేనేజ్‌మెంట్ ఆమె సారథ్యంపై నమ్మకముంచింది. మరి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో హర్మన్ తన సత్తా చాటాల్సిన అవసరముంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న రాధ యాదవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, దీప్తి శర్మ కీలకం కానున్నారు. ఆసీస్ జట్టులో స్టార్లకు కొదవలేకపోగా... మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆటకు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు.
షఫాలీ వర్మ చాలా ముఖ్యమైన ప్లేయర్. జాతీయ జట్టు తరఫున షఫాలీ ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది. తిరిగి పుంజుకొని జట్టులోకి వస్తుందని నమ్మకముంది. ప్రత్యర్థి ఎవరైనా విజయం సాధించాలనే తపనతోనే మైదానంలో అడుగు పెడతాం. వన్డేల్లో మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. దాన్నే ఇక్కడ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.
ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టు కూర్పుపై కసరత్తు చేస్తాం. స్వదేశంలో న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం సాధించాం. ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటి కోసం సిద్ధంగా ఉన్నాం. – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్
10 భారత్, ఆ్రస్టేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 53 వన్డేలు జరిగాయి. ఇందులో భారత జట్టు 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
9 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. తొమ్మిది సిరీస్‌లలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు నాలుగు వన్డే సిరీస్‌లు ఆడి నాలుగింటిలోనూ ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment