![CT 2025 India Clean Sweep Boost And England Australia Get Blows](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/indeng.jpg.webp?itok=_MlEeeXa)
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఇంగ్లండ్‌పై మూడు వన్డేల సిరీస్ విజయం టీమిండియాలో ఉత్తేజాన్ని రెట్టింపు చేసింది. ఈ సిరీస్ సందర్భంగా జట్టులోని ప్రధాన బ్యాటర్లందరూ పరుగులు సాధించడంతో మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. జట్టులోని ప్రధాన బౌలరైన జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడం జట్టుకి కాస్త అసంతృప్తిని కలిగించినా.. గాయాలపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ.. టీమ్ మేనేజిమెంట్ కానీ చేయగలిగింది ఏమీ లేదు.
ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న క్రీడాకారులతో వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆస్టేలియా పర్యటనలోనూ, సొంతగడ్డ పై శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల తో వరుసగా పరాజయాలు చవిచూసింది రోహిత్ సేన.
అయితే, ఇంగ్లండ్ విజయంతో మళ్ళీ మునుపటి రీతిలో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టు తో ఈ సిరీస్ ఏర్పాటు చేయడం భారత్ వ్యూహం ఫలించిందని చెప్పాలి.
వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఇంగ్లండ్
అయితే ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రధాన ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పేపర్ మీద ఇంగ్లండ్ చాలా పటిష్టమైన జట్టుగా కనిపిస్తున్నా..ఈ టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్ ల లో జరుగుతున్నందున.. ఆసియా జట్లు ఈ పిచ్‌లపై ఆధిపత్యం చెలాయించే అవకాశముంది.
ఇక బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లండ్ 142 పరుగుల భారీ ఓటమి చవిచూడడం ఆ జట్టుకి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.
ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోవడమే కాక అంతకుముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా భారత్ చేతిలో 1-4 తేడాతో పరాజయం చవిచూసింది. ఈ పరాజయంపై స్పందిస్తూ, భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టును తీవ్రంగా దుయ్యబట్టారు.
భారత పర్యటనలో ఇంగ్లీష్ జట్టు కేవలం ఒక నెట్ సెషన్ లో మాత్రమే పాల్గొందని, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇది చాల దారుణమైన విషయమని శాస్త్రి వెల్లడించాడు. "నేను విన్న దాని ప్రకారం, ఈ పర్యటన అంతటా ఇంగ్లాండ్ ఒకే ఒక నెట్ సెషన్ లో పాల్గొంది.
ఇంగ్లండ్ జట్టు సిరీస్ విజయం కోసం కష్టపడటానికి సిద్ధంగా లేదు," అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యాత బృందంలో భాగమైన పీటర్సన్, జాకబ్ బెథెల్ స్థానంలో ఇంగ్లాండ్ జట్టులో చేరిన టామ్ బాంటన్ భారత్ తో జరిగిన మూడో వన్డే కి ముందు గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని వెల్లడించడంతో.. శాస్త్రి ఆ జట్టుపై మరింత అసంతృప్తి వ్యక్తం చేసాడు.
గాయాల ఊబిలో ఆస్ట్రేలియా
ఇక ఇంగ్లండ్ పరిస్థితి ఇలా ఉంటే, ఈ టోర్నమెంట్ లో ప్రధాన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా జట్టు గాయాల ఊబిలో చిక్కుకొని ఉంది. ఇటీవల శ్రీలంకలో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగే వన్డే మ్యాచ్‌లలో కూడా విజయం సాధించాలని.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టు ఆత్మవిశ్వాసానికి ఇది ఎంతో కీలకమని భావిస్తోంది.
ఇటీవల భారత్‌తో సొంత గడ్డ పై జరిగిన టెస్ట్ సిరీస్ లో తన సత్తా చాటిన ఆస్ట్రేలియా తర్వాత గాయాల కారణంగా చతికిలపడింది. జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్, సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్, మరో పేస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్, ఆల్ రౌండర్ మిచ్ మార్ష్ గాయాల కారణంగా జట్టు నుంచి తప్పుకున్నారు, మరో ముఖ్యమైన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గత వారం వన్డేల నుండి రిటైర్మెంట్ అవుతున్నట్టు అనూహ్యమైన ప్రకటన చేసాడు.
ఈ ఈ పరిస్థితులలోశ్రీలంక సిరీస్ కోసం రిజర్వ్ ఫాస్ట్ బౌలర్లు సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్షుయిస్‌తో పాటు లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘ, స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీ, బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌లను సెలెక్టర్లు జట్టులోకి చేర్చారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలకమైన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా వంటి ప్రత్యర్థి ని పూర్తిగా కొట్టివేయడానికి లేకపోయినా, ఆ జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పడంలో సందేహం లేదు.
చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. కోహ్లి కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment