Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌.. కోహ్లి కామెంట్స్‌ వైరల్‌ | IPL 2025: Kohli Reacts After RCB Choose Rajat Patidar Over Him As new captain | Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌.. కోహ్లి కామెంట్స్‌ వైరల్‌

Published Thu, Feb 13 2025 4:57 PM | Last Updated on Thu, Feb 13 2025 5:43 PM

IPL 2025: Kohli Reacts After RCB Choose Rajat Patidar Over Him As new captain

విరాట్‌ కోహ్లి (PC: RCB X)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కొత్త కెప్టెన్‌ నియామకంపై ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి(Virat Kohli) స్పందించాడు. సారథిగా ఎంపికైన రజత్‌ పాటిదార్‌(Rajat Patidar)కు శుభాకాంక్షలు చెప్పిన ఈ రన్‌మెషీన్‌.. కెప్టెన్సీకి అతడు వందశాతం అర్హుడని ప్రశంసలు కురిపించాడు. అతడికి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు.

కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2025 సీజన్‌కు గానూ ఆర్సీబీ టీమిండియా ఆటగాడు రజత్‌ పాటిదార్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. సౌతాఫ్రికా వెటరన్‌ స్టార్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ స్థానంలో ఈ మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌కు పగ్గాలు అప్పగించింది. కాగా 2021లో ఆర్సీబీలో చేరిన పాటిదార్‌ను 2022 వేలానికి ముందు ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది.

కెప్టెన్‌ స్థాయికి
ఈ క్రమంలో అతడు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోగా.. రీప్లేస్‌మెంట్‌ ఆటగాడిగా మళ్లీ జట్టులోకి చేర్చుకుంది. అయితే, తన అద్బుత ఆట తీరుతో అతడు ఇప్పుడు కెప్టెన్‌ స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి రజత్‌ పాటిదార్‌ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘‘ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌ ఎంపికయ్యాడు. నీకు శుభాభినందనలు రజత్‌. నిన్ను నువ్వు నిరూపించుకుని... ఫ్రాంఛైజీతో అనుబంధాన్ని పెంచుకుని.. ఇక్కడి దాకా వచ్చావు. ఆర్సీబీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించావు. నీ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోదు.

కెప్టెన్‌గా నువ్వు అర్హుడివి. నాతో పాటు జట్టులోని సభ్యులంతా నీ వెన్నంటే ఉంటాము. నీ పాత్రను సమర్థవంతంగా పోషించేలా సహకారం అందిస్తాం. ఇదొక  కీలకమైన బాధ్యత. గత కొన్నేళ్లుగా నేనూ, ఫాఫ్‌ సారథ్య బాధ్యతలను మోశాం. ఇప్పుడు నీకు ఆ గౌరవం దక్కింది. నువ్వు ఈ స్థాయికి చేరుకోవడం పట్ల నాకు సంతోషంగా ఉంది.

 ఇది నీ హక్కు
కెప్టెన్‌గా ఉండటం ఒక రకంగా నీకు నువ్వుగా సంపాదించుకున్న హక్కు. గత రెండేళ్ల నీ ప్రయాణం అద్భుతం. టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేశావు. మధ్యప్రదేశ్‌ జట్టును ముందుకు నడిపించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుంది.  ఇక ఇప్పుడు అద్భుతమైన ఫ్రాంఛైజీ జట్టుకు సారథిగా నిన్ను నువ్వు మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.

రజత్‌ పాటిదార్‌కు మద్దతుగా ఉండాలని అభిమానులకు కోరుతున్నా. ఏది ఏమైనా.. చివరకు మన అందరికీ జట్టు ప్రయోజనాలు, గెలుపే ముఖ్యం. జట్టుగా ఎదుగుదాం. మన అద్బుతమైన ఫ్రాంఛైజీకి చిరస్మరణీయ విజయాలు అందిద్దాం. రజత్‌కు మరోసారి శుభాకాంక్షలు. అభిమానుల ప్రేమ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది. రానున్న సీజన్‌లో ఆర్సీబీ సరికొత్తగా అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

కాగా గతేడాది.. రజత్‌ పాటిదార్‌ దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇక ఐపీఎల్‌ కెరీర్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్‌ ఓ శతకం, ఏడు అర్ధ శతకాల సాయంతో 799 పరుగులు చేశాడు. ఇక తొమ్మిదేళ్లపాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 2022 సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

చదవండి: క్రెడిట్‌ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా జరిగేది అదే: రోహిత్‌ శర్మ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement