![Surprised by Exclusion Siraj Deserves Spot: Sanjay Bangar Strong Defence CT 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/siraj.jpg.webp?itok=wkou1Dgj)
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ బంగర్(Sanjay Bangar)మద్దతుగా నిలిచాడు. అతడిని ఇంగ్లండ్‌తో వన్డేలకు, చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ హైదరాబాదీ స్టార్ నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అని.. అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని యాజమాన్యానికి హితవు పలికాడు.
వన్డేలకు సిద్ధమైన రోహిత్ సేన
కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ అయింది. ఇప్పటికే సూర్యకుమార్ సేన ఐదు టీ20లలో నాలుగింట గెలిచి బట్లర్ బృందాన్ని చిత్తు చేసి సిరీస్ గెలుచుకోగా.. తాజాగా రోహిత్ సేన వన్డేలకు సిద్ధమైంది.
అందుకే చోటివ్వలేదు
అయితే, ఆసీస్ పర్యటన తర్వాత విశ్రాంతి పేరిట సిరాజ్‌ను టీ20 సిరీస్ నుంచి తప్పించిన మేనేజ్‌మెంట్.. వన్డేల్లోనూ చోటివ్వలేదు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలోనూ అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. సిరాజ్‌ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో రాణించగలుగుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అందుకే మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో చోటిచ్చినట్లు తెలిపాడు.
నాణ్యమైన బౌలర్.. అతడిని ఎలా పక్కనపెట్టారు
ఇక ఇంగ్లండ్‌తో గురువారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ విషయాలపై సంజయ్ బంగర్ స్పందించాడు. ‘‘జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన సిరాజ్‌ను పక్కనపెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని మ్యాచ్‌లలో అయితే తన అద్భుత ప్రదర్శనతో అతడే జట్టును గెలిపించాడు.
ఉదాహరణకు అహ్మదాబాద్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయంలో తన పాత్ర కూడా ఉంది. అయితే, పాత బంతితో రాణింలేకపోతున్నాడన్న కారణం చూపి అతడిని పక్కనపెట్టడం సరికాదు. అతడొక క్వాలిటీ ప్లేయర్. ఏ దశలో బాగా బౌలింగ్ చేస్తాడన్న అంశంతో సంబంధం లేకుండా నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడికి జట్టులో చోటివ్వాలి’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లోనూ సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఏడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ లంక 50 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు.
తద్వారా టీమిండియా సునాయాస విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద మాత్రం సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
అలా అయితే సిరాజ్‌కు చోటు
కానీ టెస్టులు.. వన్డే ఫార్మాట్ వేరు కాబట్టి సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చి చూడాల్సిందని సంజయ్ బంగర్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే.. సిరాజ్‌కు దుబాయ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందని మరో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. అనంతరం ఆదివారం(ఫిబ్రవరి 9) కటక్‌లో రెండో వన్డే.. అదే విధంగా అహ్మదాబాద్‌లో బుధవారం(ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ సంయుక్త వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment