ఇదేం పద్ధతి?: రోహిత్‌ శర్మ ఆగ్రహం | Rohit Sharma Furious Over Poor Form Query Breaks Silence On Retirement Rumours | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి?: రోహిత్‌ శర్మ ఆగ్రహం

Published Wed, Feb 5 2025 6:46 PM | Last Updated on Wed, Feb 5 2025 7:20 PM

Rohit Sharma Furious Over Poor Form Query Breaks Silence On Retirement Rumours

రోహిత్‌ శర్మ (PC: BCCI)

భారత టెస్టు, వన్డే  క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma)కు కోపం వచ్చింది. తన ఫామ్‌ గురించి ప్రశ్నించిన విలేకర్ల తీరుపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి పనికిరాని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని అతడు అసహనానికి లోనయ్యాడు . అదే విధంగా.. తన రిటైర్మెంట్‌ గురించి వస్తున్న ఊహాగానాలపై కూడా రోహిత్‌ శర్మ ఘాటుగా స్పందించాడు.

టెస్టుల్లో విఫలం
గత కొంతకాలంగా టెస్టుల్లో రోహిత్‌ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో.. అనంతరం ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి వైఫల్యాల పరంపర కొనసాగింది. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో ఈ ముంబైకర్‌ ఐదు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 31 పరుగులే చేశాడు.

ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా ఇటీవల ముంబై ఓపెనర్‌గా రంజీ ట్రోఫీ(Ranji Trophy) బరిలో దిగాడు రోహిత్‌ శర్మ. అయితే, అక్కడా ‘హిట్‌మ్యాన్‌’కు చేదు అనుభవమే ఎదురైంది. జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులకే అతడు పరిమితమయ్యాడు.

అసలు ఇదెలాంటి ప్రశ్న?
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌(India vs England)కు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్‌పూర్‌ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్‌ శర్మకు తన పేలవ ఫామ్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు ఇదెలాంటి ప్రశ్న?.. ఆ ఫార్మాట్‌(టెస్టు) వేరు.. ఇది వేరు.

దానికీ.. దీనికీ పోలిక ఎందుకు తెస్తున్నారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘క్రికెటర్లుగా మా కెరీర్‌లో ఎత్తుపళ్లాలు సహజం. నా ప్రయాణంలో ఇలాంటివెన్నో చూశాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ప్రతిరోజూ సరికొత్తదే. అలాగే ఆటగాడిగా నాకు ప్రతి సిరీస్‌ ఒక తాజా ఆరంభాన్ని ఇస్తుంది’’ అని రోహిత్‌ శర్మ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు.

ఇలాంటి సమయంలో 
ఇక చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత తాను రిటైర్‌ కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా రోహిత్‌ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుంది. ఇలాంటి సమయంలో నా భవిష్యత్‌ కార్యాచరణ గురించి మాట్లాడటం సరైందేనా?

నా గురించి ఎన్నో వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటన్నింటికి సమాధానం ఇచ్చేందుకు నేను ఇక్కడ కూర్చోలేదు. నాకు ప్రస్తుతం ఈ మూడు వన్డేలు.. అనంతరం చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీ మాత్రమే ముఖ్యమే.ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ మ్యాచ్‌ల మీదే ఉంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని రోహిత్‌ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా రోహిత్‌ చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్‌ సందర్భంగా యాభై ఓవర్ల ఫార్మాట్‌ బరిలో దిగాడు. గతేడాది లంకతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడి వరుసగా 58, 64, 35 పరుగులు చేశాడు.

చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన.. వెటరన్‌ ప్లేయర్‌ రీఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement