ఆసీస్‌తో వన్డే సిరీస్‌.. భారత క్రికెట్‌ జట్టుకు మరో షాక్‌ | Ind vs Aus ODIs: After Whitewash India Women Team Face More Trouble | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియాకు మరో షాక్‌

Published Fri, Dec 13 2024 10:36 AM | Last Updated on Fri, Dec 13 2024 11:18 AM

Ind vs Aus ODIs: After Whitewash India Women Team Face More Trouble

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన హర్మన్‌ సేనకు.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆసీస్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడటంతో ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. 

నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయడంతో ఓవర్‌కు 5 చొప్పున... భారత ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు రెఫరీ డేవిడ్‌ గిల్‌బర్ట్‌ వెల్లడించాడు.

విచారణ లేకుండా నేరుగా
ఐసీసీ నియమావళిలోని 2.22 ఆర్టికల్‌ ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తప్పు అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా నేరుగా కోత విధించినట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ 3-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే.

మూడో వన్డేలో స్మృతి ‘శత’క్కొట్టినా...
పెర్త్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్‌ ప్లేయర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ (95 బంతుల్లో 110; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్‌‌ తాలియా మెక్‌గ్రాత్‌ (56 నాటౌట్‌; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్‌నర్‌ (50; 5 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు.

ఒకదశలో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను అనాబెల్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. మొదట గార్డ్‌నర్‌తో ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనాబెల్‌... ఆ తర్వాత తాలియాతో ఆరో వికెట్‌కు 95 బంతుల్లో 122 పరుగులు జతచేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా... దీప్తి శర్మ ఒక వికెట్‌ దక్కించుకుంది.

ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (109 బంతుల్లో 105; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నుంచి ఆమెకు ఎటువంటి సరైన సహకారం లభించలేదు. ఒక్క హర్లీన్‌ డియోల్‌ (39; 4 ఫోర్లు) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు.

అండగా హర్లీన్‌ డియోల్‌
స్మృతి–హర్లీన్‌ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసినా... తర్వాత వచ్చిన వాళ్లు అదే జోరును కొనసాగించలేకపోయారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (12), రిచా ఘోష్‌ (2), జెమీమా రోడ్రిగ్స్‌ (16), దీప్తి శర్మ (0), మిన్ను మణి (8) విఫలమయ్యారు. 

ఫలితంగా టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్‌ కాగా.. కంగారూ జట్టు 83 రన్స్‌ తేడాతో జయభేరి మోగించింది. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ 5 వికెట్లు తీయగా... మేగన్‌ షుట్, అలానా కింగ్‌ రెండేసి వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అనాబెల్‌ సదర్లాండ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌ అతడే: రిక్కీ పాంటింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement