
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) వద్దని వారించినా....భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి (ఎస్‌జీఎమ్) సిద్ధమైంది. ఆటగాళ్ల కొత్త కాంట్రాక్టు ఫీజులకు ఈ సమావేశంలో ఆమోదం లభించనుంది. దీంతో పాటు మరో పది అంశాలను ఇందులో చర్చించనున్నారు. ఇది వరకే వార్షిక ఫీజుల్ని పెంచినప్పటికీ బోర్డు నుంచి తుది ఆమోదం దక్కకపోవడంతో క్రికెటర్లకు పెంచిన జీతాలు ఇవ్వలేకపోయామని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు.
‘పెంచిన పారితోషికాలను ఇంకా ఇవ్వకపోవడంపై నాకు విచారంగానే ఉంది. అయితే బోర్డు సర్వసభ్య సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జీతాల పెంపు ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఫైనాన్స్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఆమోదం పొందగానే నేను సంతకం చేస్తాను. లేదంటే లేదు’ అని అమితాబ్ అన్నారు. మరోవైపు బోర్డు ఖర్చులతో అనధికారికంగా భూటాన్ పర్యటనకు వెళ్లొచ్చిన అమితాబ్ చౌదరికి సీఓఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లడమేంటని అందులో ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment