న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) భారత క్రికెట్ జట్టు కొత్త శిక్షకుల కోసం మంగళవారం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఇంత ఆకస్మికంగా కోచ్‌ల ఎంపిక ప్రక్రియను చేపట్టడాన్ని బీసీసీఐలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా వార్షిక సర్వసభ్య సమావేశం (అక్టోబర్ 22) తేదీని ప్రకటించిన తర్వాత ఇంత అత్యవసరంగా కోచ్‌లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని, త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సమావేశమవుతామని తెలిపిన సీఓఏ.. ఇంత ఆకస్మికంగా కోచ్‌ల ఎంపిక ప్రక్రియ చేపట్టడాన్ని సహించలేమని బీసీసీఐకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
‘ఇది చాలా పెద్ద తప్పు. సీఓఏ సర్వసభ్యసమావేశ తేదిని ప్రకటించి ఇప్పుడు కోచ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించడం ఏమిటి? ప్రపంచకప్ ఓటమి కారణాలను తుడిచిపెట్టడానికేనా? మెగా టోర్నీలో ఓటమిపై టీమ్ మేనేజర్‌తో సహా సంబంధింత కోచ్‌లు నివేదికనివ్వాల్సుంది. విజయ్‌శంకర్ గాయంపై వచ్చిన పుకార్లపై సమాధానం చెప్పాలి. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ నాలుగో స్థానంపై సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే జట్టు మేనేజ్‌మెంట్ ఆ స్థానం కోసమే ప్రత్యేకంగా కొంతమంది ఆటగాళ్లను కోరింది. ఇదంతా జరగుకుండా కోచ్‌ల ఎంపిక ప్రక్రియను చేపట్టడం సరికాదు’ అని ఆ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)ని మార్చాలనుకుంటున్న సీఓఏ నిర్ణయంపై కూడా బీసీసీఐ అధికారులు మండిపడుతున్నారు. సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన సీఏసీ కమిటీని రద్దుచేసి కొత్త సీఏసీని నియమించాలని సీఓఏ భావిస్తోంది. అయితే కొత్త సీఏసీ ఏర్పాటు చేస్తే నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని మరో అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment